బౌలర్ బాల్ వేశాడు. అంపైర్ వైడ్ ఇచ్చాడు. మరో బంతి విసిరాడు. మళ్లీ అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఈ వైడ్‌ల నేపథ్యంలోనే బౌలర్‌కు బ్యాట్స్‌మెన్‌కు మధ్య వివాదం రేగింది. దీంతో బౌలర్ కోపంతో ఫెయిర్ గేమ్ ఆడాలని ఇలా మోసం చేయవద్దని అన్నాడు. బౌలర్ మాటలతో మండిపడిన బ్యాట్స్‌మెన్ ఏకంగా అతడి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. గొంతుపట్టుకుని పిసికేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే సిబ్బంది వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటన న్యూజిల్యాండ్ క్లబ్ క్రికెట్‌లో చోటు చేసుకుంది.
శనివారం న్యూజిల్యాండ్‌లో ఓ కమ్యూనిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా సబర్బ్స్ న్యులిన్, హౌవిక్ పకురంగా క్లబ్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఇరు జట్ల మధ్య వైడ్ బాల్స్ విషయంలో వివాదం రేగింది. సబర్బ్స్ న్యులిన్ బౌలర్ అర్షద్ బషీర్(41) బౌలింగ్ చేస్తున్నప్పుడు తరచుగా వైడ్స్ ఇస్తుండడంతో విసిగిపోయిన అర్షద్ మోసం చేయవద్దని, ఫెయిర్ గేమ్ ఆడాలని అన్నాడు. దీంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఆగ్రహంతో అతడివైపు దూసుకొచ్చి అతడిపై దాడి చేశాడు.
కాగా.. ఆసుపత్రిలో కోలుకున్న అర్షద్.. సదరు బ్యాట్స్‌మన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గొంతు నులమి, ముఖంపై పిడిగుద్దులు గుద్దాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడుతూ పార్ట్ టైమ్‌గా ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసుకుంటున్నానని, అయితే ఇప్పుడు గాయపడడంతో తన ఆదాయ మార్గం కూడా దెబ్బతిన్నదని అర్షద్ వాపోయాడు. ఈ గొడవ వల్ల 300 డాలర్లు నష్టపోయానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ గొడవపై ఆక్లాండ్ క్రికెట్ సంఘం కూడా స్పందించింది. దాడికి పాల్పడిన ఆటగాడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే తనపై దాడికి పాల్పడిన ఆటగాడిని నిషేదించాలంటూ అర్షద్ ఆక్లాండ్ క్రికెట్ సంఘాన్ని డిమాండ్ చేశాడు.