క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సాధించిన మరో రికార్డును బద్దలు కొట్టేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. అలాగే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను కూడా అధిగమించి టాప్ కెప్టెన్‌గా అనిపించుకునేందుకు ఓ అడుగు దూరంలో నిలిచాడు. వన్డేల్లో స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇప్పటివరకు టాప్‌లో ఉన్నాడు. ఈ రికార్డును కోహ్లి ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ద్వారా అధిగమించే అవకాశం ఉంది. సొంతగడ్డపై సచిన్.. 164 మ్యాచ్‌లలో 20 సెంచరీలు సాధించాడు. కాగా.. కోహ్లీ ఇప్పటివరకు కేవలం 95 వన్డేల్లోనే 19 శతకాలు సాధించాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల్లో కనీసం రెండు సెంచరీలు చేసినా.. కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించేస్తాడు. ఒకవేళ ఒక్క సెంచరీనే చేసినా.. సచిన్ రికార్డును సమయం చేస్తాడు. అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా కూడా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం పాంటింగ్‌తో పాటు కోహ్లీ 41 శతకాలతో సమానంగా ఉన్నారు.
ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ రికార్డును అధిగమించేందుకు అతి చేరువలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా తరపున వన్డేల్లో ఓపెనర్‌గా 7240చేశాడు. కాగా.. రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డేల్లో 7148 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కేవలం 93 పరుగులు చేస్తే, ఈ రికార్డును అధిగమిస్తాడు. అంతేగాక భారత్ తరఫున వన్డేల్లో మూడో అత్యంత విజయవంతమైన ఓపెనర్‌గా చరిత్రకెక్కుతాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్(15310) సౌరభ్ గంగూలీ(9146) టాప్‌లో కొనసాగుతున్నారు.
వీరితో పాటు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డేల్లో 6000 పరుగులకు చేరువలో ఉన్నాడు. ధవన్ ఇప్పటివరకు 136 వన్డేల్లో 5808 పరుగులు చేశాడు. ఇక స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఈ వన్డే సిరీస్‌తో 100 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు 53 వన్డేల్లో 92 వికెట్లు తీసిన చాహల్, ఈ సిరీస్‌లో 8 వికెట్లు తీస్తే 100 వికెట్లు తీసిన స్పిన్నర్‌ల జాబితాలో చేరతాడు. ఈ ఫీట్ సాధించిన తొమ్మిదో భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఇక యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ కోహ్లీ, ధవన్‌లను దాటేసే పనిలో ఉన్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లుగా కోహ్లీ, శిఖర్ ధవన్(24 ఇన్నింగ్స్) ఉన్నారు. అయితే అయ్యర్ ఇప్పటికే వన్డేల్లో 19 ఇన్నింగ్స్‌లో 807 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 8 అర్ధ శతకాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సిరీస్‌లో 193 పరుగులు సాధిస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ, ధవన్‌లను వెనక్కి నెట్టేస్తాడు.