శుక్రవారం ఐపీఎల్ 2021లో భాగంగా కోహ్లీ సేనతో జరిగిన టోర్నీ మొదటి పోరులో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది. అంటే ఎప్పటిలానే ఈసారి కూడా ఈ టోర్నీని ఓటమితోనే మొదలుపెట్టింది. అయితే గతంలో 8 సార్లు ఓటమితో టోర్నీని మొదలు పెట్టిన ముంబై.. ఆ టోర్నీల్లో ఏకంగా 5 సార్లు విజేతగా రికార్డు నెలకొల్పింది. 2013 నుంచి ఇప్పటి వరకు ముంబై ఒక్కసారి కూడా తొలిపోరులో విజయ సాధించలేదంటే ఆ సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సీజన్‌లోనూ అదే సెంటిమెంట్‌ను ముంబై కొనసాగించింది.
ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి అనండంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకూ అత్యధిక సార్లు ట్రోఫీలు కైవసం చేసుకున్న ముంబై.. టాప్‌లో కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ సీజన్‌లో డిఫెండిగ్ ఛాంపియన్‌గానూ ఉంది. ఎదురుగా ఏ జట్టు ఉన్నా వారికి భారీ పోటీ ఇస్తుంది. అయితే ఇంత బలమైన జట్టుకు ఓ బలహీనత ఉంది. అదేంటంటే తొలి మ్యాచ్ ఓడిపోవడం. ఏ జట్టైనా టోర్నీని విజయంతో ప్రారంభించేందుకు ఇష్టపడతాయి. కానీ రోహిత్ సేన మాత్రం తొలి పోరును ఓటమితో మొదలెడుతూ.. ఆ తర్వాత మాత్రం విజృంభించి ఆడుతుంది. ఇప్పటివరకు ముంబై వరుసగా తొమ్మిది సార్లు ఆరంభ పోరులో ఓడిందంటే ముంబై పరిస్థితేంటో అర్థమైపోతోంది.
కాగా.. ఈ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని కొంతమంది క్రికెట్ అభిమానులు.. ఈ సారి కూడా ముంబై జట్టే కప్పు కొడుతుందని ధీమాగా చెబుతున్నారు. అయితే 2013లోనూ ముంబై తన తొలి మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడింది. అందులో ఆర్‌సీబీ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయింది. ఆ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ 37 బంతుల్లో 60 పరుగులు చేసి పోరాడినా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన ముంబై కేవలం 154 పరుగులు మాత్రమే చేసింది. కానీ, తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమి చవిచూసినా.. ఆ టోర్నీతోనే ముంబై తన తొలి ట్రోఫీని సొతం చేసుకుంది. అప్పటినుంచి వరుసగా ఇదే తరహాలో రాణిస్తోంది.