చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుండడంతో ఏ జట్టు గెలుస్తుంది..? ఏ జట్టు బలాబాలాలేంటి..? అనే దానిపై ఇప్పటికే అనేకమంది సీనియర్లు తమ స్థాయి అంచనాలు కట్టేస్తున్నారు. కొందరు ఏ జట్టు ఎంతలా రాణిస్తుందని చెబితే, మరికొందరు ఏ ఆటగాడి ప్రదర్శన ఎలా ఉండనుందని కూడా జోస్యం చెబుతున్నారు. ఇదే తరహాలో తాజాగా మాజీ బౌలర్ ప్రగ్యాన్ ఓఝా కూడా తన అంచనాలను పంచుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఓఝా.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలకంగా మారనున్నాడట. “హర్భజన్ ఎన్నో మ్యాచ్‌లలో భారత జట్టుకు కీలకంగా ఉన్నాడు. భారత జట్టుకు ఆడిన అతని అనుభవం ఐపీఎల్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. కేకేఆర్ తుది జట్టులో బజ్జి ఉంటే మాత్రం కీలక పాత్ర పోషిస్తాడు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో సొంత మైదానంలో ఆడే అవకాశం ఏ జట్టుకు లభించలేదు. ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో జరగనున్నాయి. దాంతో ఈ సీజన్‌లో టాలెంట్ తో పాటు అనుభవం కూడా చాలా ముఖ్యం.
ఇక భజ్జీ విషయానికొస్తే అతడు గతంలో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ తరపున ఆడడంతో ఆయా వేదికల్లో భజ్జీ అద్భుతంగా రాణించగలడు. సీఎస్‌కేకు రైనా అనుభవం ఎలా ఉపయోగపడుతుందో.. కేకేఆర్‌కు హర్భజన్ అనుభం కూడా అలానే అవసరమవుతుంది. వీరిద్దరు గత సీజన్‌కు దూరమైనా ఈ ఏడాది తమ ఆటతో అందరినీ ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరూ ఇప్పటికే ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యార” ని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే గతేడాది వ్యక్తిగత కారణాల హర్భజన్ ఆటకు దూరమయ్యాడు. అయితే ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కేకేఆర్ కనీస ధర రూ. 2 కోట్ల చెల్లించి హర్భజన్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఏడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న హర్భజన్ జట్టుతో చేరి ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇక కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది. ప్రస్తుతం ఈ ఐపీఎల్‌లో బజ్జీ ఏ రేంజిలో ఆడతాడని అందరూ వేచిచూస్తున్నారు.