మన దేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా..? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీళ్లలో ఎవరో ఒకరు అయి ఉంటారని అనుకుంటున్నారా..? అయితే మీ అభిప్రాయం మార్చుకోండి. ఎందుకంటే మన దేశంలో అత్యంత సంపన్నుడైన క్రికెటర్ ఓ రంజీ ప్లేయర్. అవును.. అతడి పేరు ఆర్యమన్ బిర్లా. ఈ పేరు వినగానే మీకు అసలు విషయం అర్థమైపోయి ఉంటుంది. మీరు ఊహించిన నిజమే ఇతడు వేల కోట్ల విలువైన బిర్లా సామ్రాజ్య యువరాజే. పుట్టుకతోనే బిలియనీర్ అయిన ఆర్యమన్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే క్రికెట్ ఆడుతూ ఎప్పటికైనా దేశం తరపున జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.
కుమార మంగళం బిర్లా.. వేల కోట్ల బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి మహారాజు. ఈయన తనయుడే క్రికెటర్ ఆర్యమన్ బిర్లా. ఆర్యమన్ బిర్లా మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీలు ఆడుతున్నాడు. బిర్లా సామ్రాజ్యం విలువ రూ.70 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్యమన్ వయసు 23 ఏళ్లు. ఇంత విలువైన బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి ఆర్యమన్ త్వరలోనే అధిపతి కాబోతున్నాడు. అయితే ఇంత ఆస్తి ఉన్నా.. భారత్ తరపున జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని అతడి ఆశ. అందుకే చాలా కాలం నుంచి మధ్యప్రదేశ్ తరపున రంజీల్లో ఆడుతూ తెగ కష్టపడుతున్నాడు.
ఆర్యమన్ ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు తరపున బరిలోకి దిగాడు. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఆర్యమన్ బిర్లాను రూ.31 లక్షలకు కొనుగోలు చేసింది. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ఆర్యమన్ చిన్నప్పటి నుంచి ఆశపడుతున్నాడు. అందుకోసమే ప్రతిరోజూ మైదానంలో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంటాడు. రంజీ మ్యాచ్‌లన్నిటిలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్వతహాగా.. లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్, బౌలర్ అయిన ఆర్యమన్ గతంలో జరిగిన సీకే నాయుడు ట్రోఫీలో 6 మ్యాచ్‌లు ఆడి 79.50 సగటుతో 795 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. మరి ఈ బిలియనీర్ క్రికెటర్.. ఆర్యమన్ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.