పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సౌత్‌ఆప్రికా క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ బోర్డుపై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో అఫ్రిదీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కవాళ్లపై వేలెత్తి చూపేటప్పుడు ముందు మనం సక్రమంగా ఉండాలని అతడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఐపీఎల్ అంటే ఎందుకంత కుళ్లుకుంటున్నావంటూ విమర్శిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను పాక్ గెలుచుకున్న సందర్భంగా అఫ్రిదీ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్‌ను విమర్శించాడు. ఓ పక్క సిరీస్ కొనసాగుతుండగానే సౌత్‌ఆఫ్రికా జట్టు తమ ఆటగాళ్లను ఐపీఎల్ కోసం విడుదల చేయడాన్ని అఫ్రిది తప్పుబట్టాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌కు దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి నిర్ణయాలపై జాతీయ క్రికెట్ బోర్డులు పునరాలోచన చేయాలని సూచించాడు. ఈ మేరకు ట్విటర్‌లో అతడు పోస్ట్ చేయడంతో నెటిజన్లకు టార్గెట్‌గా మారాడు.
‘ఓ వైపు సిరీస్ జరుగుతోంది. వన్డేల తరువాత టీ20లు జరగాల్సి ఉంది. కానీ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆటగాళ్లను ఐపీఎల్ కోసం విడుదల చేసేసింది. అది నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. టీ20 లీగ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌ను ఈ విధంగా ప్రభావితం చేయడం నిజంగా బాధాకరం. ఇలాంటి నిర్ణయాలపై జాతీయ క్రికెట్ బోర్డులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అయితే అఫ్రిది చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ ఐపీఎల్ ఆడడం లేదు కనుకే అఫ్రిదీ ఇలాంటి విమర్శలు చేస్తున్నాడని, ఒకవేళ వారు కూడా ఆడుతూ ఉంటే సౌత్‌ఆఫ్రికా కంటే ముందు వాళ్లే ఇక్కడుండేవారని ఎద్దేశా చేస్తున్నారు. ఐపీఎల్ జరుగుతున్నందున టీ20 లీగ్‌లపై అఫ్రిదీకి ఎక్కడలేని కోపం వచ్చిందని, కానీ అతడు కూడా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడిన విషయం మర్చిపోయాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
‘మీ జట్టుకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు కదా. అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నావనుకుంటా. టీ20 లీగ్‌ల గురించి తెగ బాధపడిపోతున్నావు సరే.. మరి నువ్వు కూడా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూనే ఉన్నావు కదా..? అప్పుడు వాటి గురించి గుర్తుకురాలేదా..? నీకొక రూల్, మిగతా వాళ్లకు ఒక రూల్ ఉంటుందంటావా?’’ అంటూ తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.