చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అనే పుకార్లపై చెన్నై ఫ్రాంచైజీ స్పందించింది. సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ధోనీకిది చివరి సీజన్ కాదని, అతడు కచ్చితంగా భవిష్యత్తులోనూ తమ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తాడని అన్నారు. అంతేకాకుండా ధోనీ స్థానంలో మరో ఆటగాడి గురించిన తాము ఎలాంటి ఆలోచన చేయలేదని స్పష్టం చేశారు. ఇక పుజారా కూడా గొప్ప బ్యాట్స్‌మన్ అని, అద్భుతమైన టెక్నిక్‌తో ఏ ఫార్మాట్‌కైనా తనను తాను మలచుకోగలడన్న నమ్మకంతోనే అతడిని తీసుకున్నామని విశ్వనాథన్ తెలిపారు. అతడిని గౌరవించాలనే ఉద్దేశంతోనే వేలంలో కొనుగోలు చేశామని తెలిపారు.
కాగా.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి గతేడాది వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ వరకు జాతీయ జట్టుకు ఆడతాడనుకున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ తరువాత ధోనీ రెండో ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఈ క్రమంలోనే ధోనీకిదే ఆఖరి ఐపీఎల్ అని, ఈ టోర్నీ తరువాత ధోనీ ఇక ఐపీఎల్ ఆడడంటూ అనేక రూమర్లు వినిపించాయి. కాగా.. వీటిపై సీఎస్‌కే స్పందించినా.. ధోనీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
ఇదిలా ఉంటే ధోనీ తన కెరీర్లో అత్యధికంగా 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 41.0 సగటుతో 136.8 స్ట్రైక్ రేట్‌తో 4,632 రన్స్ చేశాడు. అందులో 23 అర్థ సెంచరీలున్నాయి. కానీ ధోనీ ఐపీఎల్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం.