పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఓ టీచర్ తన స్టూడెంట్ పైనే కన్నేసింది. అతడిని పెళ్లి చేసుకుని, శోభనం కూడా కానిచ్చింది. ఆ తరువాత విధవగా మారి సంతాప సభ నిర్వహించింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడం వారు గగ్గోలు పెడుతూ పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. ఓ టీచర్ ఇంత విచిత్రమైన పనిచేయడానికి మూఢనమ్మకాలే కారణమని తెలియడంతో పోలీసులు కూడా ముక్కున వేలేసుకున్నాడు.
జలంధర్‌లోని ఓ టీచర్‌కు ఎన్నాళ్లు గడుస్తున్నా పెళ్లి కావడం లేదు. దీంతో ఆమె చాలా బాధపడేది. పెళ్లి జరగకపోవడానికి కారణం మాంగ్లిక్ దోషమేనని, దానిని పోగొట్టుకోవాలంటే వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని విధవగా మారాలని సదరు జ్యోతిష్యుడు చెప్పాడు. ఆ మాటలను గుడ్డిగా నమ్మేసింది. తన క్లాసులోని ఓ విద్యార్థిని సెలెక్ట్ చేసుకుంది. అతడు ఆమెకన్నా 10ఏళ్ల చిన్నవాడు. తల్లిందండ్రులు కూడా ఆమెకు సహకరించారు.
పరీక్షలు దగ్గరపడుతున్నాయని, అందువల్ల అతడికి ప్రత్యేక క్లాసులు చెబుతానని, వారం రోజులు తనవద్దే ఉంచుకుంటానని విద్యార్థి తల్లిదండ్రులను నమ్మించింది. వారు కూడా చదువు కోసమే కదా.. అని సరేనన్నారు. ఇంటికి తీసుకొచ్చిన తరువాతి రోజు మెహందీ కార్యక్రమం, ఆ తరువాతి రోజు పెళ్లి, ఆ రాత్రే తూతూమంత్రంగా శోభనం కానిచ్చేసింది. అన్ని కార్యక్రమాలనూ సంప్రదాయబద్ధంగా తల్లిదండ్రులతో కలిసి నిర్వహించింది. విద్యార్థి భయంతో వెళ్లి పోతానని అన్నా.. భయపెట్టి ఉంచారు.
మూడోరోజు భర్త చనిపోయినట్లు విధవగా మారి, సంతాప కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే అదృష్టవశాత్తూ విద్యార్థిని ఏమీ చేయలేదు. వారం తరువాత విడిచిపెట్టింది. దీంతో భయంతో బతుకుజీవుడా అనుకుంటూ విద్యార్థి వెంటనే ఇంటికి చేరి తల్లిదండ్రులకు మొత్తం వివరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన అతడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఆశ్రయించారు. అయితే ఇరుపక్షాలతో మాట్లాడిన పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చి పంపిచేశారు. మరి ఇప్పుడు మాంగ్లిక్ దోషం పోయింది కదా.,. ఆ టీచర్‌కు పెళ్లవుతుందేమో చూడాలి.