టీ20 సిరీస్‌లో దారుణ ప్రదర్శన చేసినా.. వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను తుది జట్టులో ఉంచింది టీమిండియా. ఈ నమ్మకాన్ని రాహుల్ కూడా నిలబెట్టుకుని అర్థ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలోనే తొలి వన్డే ముందు రాహుల్ గురించి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టీమిండియాపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా రాహుల్ గురించి మాట్లాడాడు. రాహుల్ కీలకమైన ఆటగాడని, అతడిని వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో ఆడించాలని సూచించాడు. అతడిని పక్కన పెట్టవద్దని, అది టీమిండియాకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డాడు.
‘ఫామ్‌లో లేని ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం సరైన పద్ధతి కాదు. ప్రస్తుతం రాహుల్ ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. అతడిని ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల్లోనూ ఆడించాలి. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలివ్వడం ద్వారా వారిని తిరిగి గాడిలో పడేయొచ్చు. అందులో జట్టు వారికి అండగా ఉండాలి ’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. రాహుల్ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరిన్ని అవకాశాలివ్వడం జట్టుకే మంచిదని, అలాంటి అటగాడు తనదైన రోజున విలువైన పరుగులు చేస్తాడని అన్నాడు. గంభీర్ అన్నట్లుగానే ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో రాహుల్ సత్తా నిరూపించుకున్నాడు. కీలక వికెట్లు పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అర్థ సెంచరీతో రాణించడమే కాకుండా కృనాల్ పాండ్యాతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ రాహుల్ కేవలం 1, 0, 0, 14 పరుగులు మాత్రమే చేశాడు. చివరి టీ20కి జట్టులో స్థానం కోల్పోయాడు. కాగా.. రాహుల్ గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ తరపున ఆడిన రాహుల్.. మొత్తం టోర్నీలో 670 పరుగులు చేసి టీ20ల్లో అతడెంత భయంకరమైన ఆటగాడో తెలిపాడు. ఆ తరువాత జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా తదుపరి సీరీస్‌లకు జట్టులో స్థానం కోల్పోయాడు.