టీమిండియా క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ వినూత్న విషయం జరగబోతోంది. టీమిండియా మెన్స్ అండ్ విమెన్స్ ఒకే విమానంలో ప్రయాణించబోతున్నారు. పురుషులు- మహిళల క్రికెట్ జట్ల సభ్యులు కలిసి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించబోతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లీసేన, మహిళా క్రికెట్ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది. విశేషం ఏంటంటే ఇలా పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించడం భారత క్రికెట్ హిస్టరీలో ఇదే తొలిసారి. భారత్‌లో కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం టీమిండియా మెన్స్ జట్టు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇంగ్లండ్ చేరుకున్నాక ఇరు జట్లు వారం రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. అయితే అంతకుముందు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ ఈ నెల 19న ముంబైలో సమావేశం కావాలని బీసీసీఐ అధికారులు నిర్ణయించారు. అనంతరం ఆటగాళ్లందరూ 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ సమయంలో ప్లేయర్లందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహించున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. కాగా.. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలనుకున్న ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిల్యాండ్ ఆడనుంది. అలాగే ఇంగ్లీష్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. కాగా.. డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జూన్ 16 నుంచి వరుస సిరస్‌లు జరగనున్నాయి. తొలుత ఓ టెస్ట్, ఆ తర్వాత 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.