మైదానంలో ప్రశాంతమైన కోహ్లిని చూడాలనుకుంటున్నారా లేదా కోపంగా ఉండే కోహ్లీని చూడాలనుకుంటున్నారా..? అని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. దానికి స్టోక్స్ ఓ వింతైన సమాధానం ఇచ్చాడు. ‘నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, విరాట్ పరుగులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే అది మాకు మంచిది కాదు కాబట్టి’ అంటూ తెలివిగా సమాధానమిచ్చాడు. అదే విధంగా, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునే అంశం గురించి బెన్‌స్టోక్స్ మాట్లాడుతూ.. ‘నంబర్ 1గా ఉండే అర్హత మా జట్టుకు ఉంది. మేం ఆడిన తీరే మమ్మల్ని ఆ స్థానానికి తీసుకువెళ్లింది. అయితే, ర్యాంకులే ప్రధానం కాదు, ఆటపై దృష్టి సారిస్తే నంబర్లు వాటంతటవే మారతాయి. కాబట్టి మా ఫోకస్ అంతా మ్యాచ్‌పైనే ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే కోహ్లీ విధానంపై కూడా స్టోక్స్ స్పందించాడు. కోహ్లీలా తమ వల్ల కాదని, అది అతడి జట్టుకు, అతడి జట్టు సభ్యులకు మాత్రమే చెల్లిందని, తమకు కుదరదని తేల్చి చెప్పాడు.
తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం బెన్ స్టోక్స్ మీడియాతో మాట్లాడాడు. ‘మైదానంలో దూకుడుగా వ్యహహరించడం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి జట్టుకు సాధ్యమవుతుందేమో. మాకు కుదరదు. ఒక్కో జట్టుది ఒక్కో శైలి ఉంటుంది. అయితే ప్రత్యర్థి తన ప్రవర్తనతో మంచి ఫలితాలు సాధిస్తుండడంతో మా ప్రవర్తన మార్చుకోవాల్సిన పనిలేదు. ప్రతీ జట్టుకు, ప్రతీ ఆటగాడికి తమదైన వ్యక్తిత్వం, పద్ధతులు ఉంటాయి. అదే వారి విజయానికి నాంది పలుకుతాయి. దూకుడుగా ఉండటం ఎల్లప్పుడూ సత్పలితాలను అందించదం’టూ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
తొలి వన్డేలో ఓటమి చవిచూసినా రెండో వన్డేలో గెలిచేందుకు, అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా పోరాడుతామని స్టోక్స్ అన్నాడు. పుణె వేదికగా మార్చి 23న జరిగన తొలి వన్డేలో ఇంగ్లండ్, భారత్ చేతిలో 66 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా విధించిన 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఆధిక్యం కనబరిచినా, టీమిండియా బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ మట్టికరిచింది. ఇక ఈరోజు(శుక్రవారం) జరగబోయే రెండో వన్డేతో టీమిండియా సిరీస్ గెలుచుకుంటుందా..? లేక ఇంగ్లండ్ ఆశలు సజీవంగా ఉంచుకుంటుందా..? అనేది తేలనుంది.