భారత్, పాక్‌ల మధ్య ఈ ఏడాది ఆఖర్లో ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఓ ట్వీట్ చేసి క్రికెట్ అభిమానుల గుండెల్లో కొత్త ఆశ రేపాడు. ‘భారత్-పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడితే నాకంటే సంతోషించేవారు మరొకరుండరు. ఇరు దేశాలూ కలిస్తే నా కల నెరవేరినట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకరికొకరు అండగా ఉండటం చాలా అవసరం’ అని కెవిన్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలని ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కెవిన్ పై వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలా ఉంటే మోదీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కెవిన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాక్ ఇండియాకు వచ్చే అవకాశం ఉండడం, అలాగే ఇరు జట్ల మధ్య ఓ టీ20టోర్నీ కూడా జరిగే అవకాశం ఉందని పాక్ మీడియాలో వరుస కథనాలు ప్రసారం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో కెవిన్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. నిజంగానే దాయాది దేశాలు మళ్లీ ఒక్కటై క్రికెట్ ఆడతాయేమోనని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. కాగా ఈ పరిణామాల నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లు కూడా ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి ఎనిమిదేళ్లవుతుంది. చివరిసారి ఈ రెండు జట్లు 2012-13లో భారత్ వేదికగా తలపడ్డాయి. ఈ సిరీస్‌లో 2 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. పాక్ వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్లు చెరో టీ20 గెలవడంతో టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాక్‌లో పర్యటించింది. ఇవి మినహా ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడ్డాయి. భారత్, పాక్‌లు చివరిసారిగా 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగల తేడాతోఘనవిజయం సాధించింది. పాక్‌ను చిత్తు చేసింది.