భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో చిట్టచివరికి టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ ఇండియా గెలిచినా.. సంచలన ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసులను దోచుకున్నాడు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్. 83 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు చేసి ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో 8 లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శామ్ కర్రన్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే శామ్‌ను ప్రశంసించిన ఆ జట్టు ప్రస్తుత కెప్టెన్ బట్లర్.. రాబోయే ఐపీఎల్‌లో ధోనీతో కలిసి శామ్ కర్రాన్ ఆడుతుండడం అతడి కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు.
మ్యాచ్ పూర్తిగా చేజారిపోయిందనుకున్న సమయంలో శామ్ వీరోచిత పోరాటంతో ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌పై ఆశలు నిలిపాడని, అయితే చివర్లో నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదని బట్లర్ చెప్పాడు. అయినా శామ్ పోరాడిన తీరు అమోఘమని ప్రశంసించాడు. శామ్‌లో తనకు ‘గ్రేట్ ఫినిషర్’ మహేంద్ర సింగ్ ధోనీ లక్షణాలు కనిపించాడని బట్లర్ చెప్పాడు. నరాలు తేగే ఉత్కంఠ మధ్య కూడా ఇంత అద్భుత ఆటతీరు ధోనీలో మాత్రమే చూశానని, ఇప్పుడు తమ ఆటగాడు కూడా అదే స్థాయిలో ఆడడం గొప్ప విషయమని బట్లర్ పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం వర్చువల్ సమావేశంలో బట్లర్ మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుందని, ఈ ఐపీఎల్‌లో శామ్ కర్రాన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగడం అతడికి బాగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ‘ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌లో శామ్ కర్రాన్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఈ క్రమంలోనే అతడు కచ్చితంగా ఆదివారం ఇన్నింగ్స్ గురించి ధోనీతో చర్చిస్తాడు. అది అతడి కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతరాతీయ క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన క్రికెటర్‌గా, ఫినిషర్‌గా ఎంఎస్ ధోనీకి గొప్ప పేరుందని, అంతటి గొప్ప ఆటగాడితో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం అతడి సలహాలు, సూచనలు అందుకోవడం శామ్ కెరీర్‌కు గొప్పగా ఉపయోగపడుతుందని బట్లర్ చెప్పుకొచ్చాడు.