టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషభ్ పంత్ ఇలాగే బ్యాటింగ్ చేస్తే దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, ఆడం గిల్‌క్రిస్ట్‌లను అధిగమిస్తాడంటూ ఇంజమామ్ పేర్కొన్నాడు. టీమిండియా మిడిలార్డర్‌లో రిషబ్ మూల స్థంభంలా మారాడని, లోయర్ ఆర్డర్‌లో పంత్ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతుండడం టీమిండియాకు కలిసొస్తోందని చెప్పుకొచ్చాడు. సంయమనంతో ఆడుతూనే దూకుడుగా బౌండరీలు బాదే పంత్ వల్ల మిడిల్ ఓవర్స్‌లో టీమిండియా రన్‌రేట్ మరింత పెరుగుతోందని ఇంజమామ్ అన్నాడు.
‘పంత్‌ని కొద్దికాలంగా గమనిస్తున్నాను. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా.. అతడి ఫామ్‌లో దూకుడు తగ్గడం లేదు. పంత్ బ్యాటింగ్ చేసే విధానం, పరుగులు చేసే తీరు చాలా గొప్పగా ఉంటాయి. అలాంటి ఆటతీరు గత 30 ఏళ్లలో ధోనీ, గిల్‌క్రిస్ట్‌లలో మాత్రమే నేను చూశాను. ఈ ఇద్దరు వికెట్‌కీపర్లూ మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల సమర్థులైన బ్యాట్స్‌మెన్. వాళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు పంత్‌లో చూస్తున్నాను. పంత్‌ను చూస్తే వాళ్లను సైతం అధిగమించేలా ఉన్నాడం’టూ ఇంజమామ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇదిలా ఉంటే 2017లో టీమిండియాలోకి పంత్ అడుగుపెట్టినా.. ఫామ్ నిలబెట్టుకోలేకపోవడం, క్రీజులో కుదురుకోలేకపోవడం, భారీ స్కోర్లు చేయకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. కొద్ది నెలల క్రితం జరిగిన ఆసీస్ సిరీస్‌లో కూడా తొలి టెస్టులో అతడికి చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో స్థానం లభించడంతో అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ప్రధానంగా ఆసీస్ సిరీస్‌లో గాబాలో జరిగిన ఆఖరి టెస్ట్‌లో సెంచరీతో దంచికొట్టి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అంతకుముందు మ్యాచ్‌లలో సైతం అనేకసార్లు అర్థ సెంచరీలతో రాణించాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్, టీ20, వన్డే సిరీస్‌లలోనూ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. వరుస అర్థ సెంచరీలతో జట్టుకు వెన్నెముకగా మారాడు. కీపింగ్‌లోనూ ఎంతో గొప్పగా రాణిస్తున్నాడు. అనేకమంది మాజీలు సైతం పంత్ చాలా పరిణితి సాధించాడని, ముఖ్యంగా ఆసిస్, ఇంగ్లండ్ సిరీస్‌లో అతడిలో చాలా మార్పు కనిపించిందని ప్రశంసించడం విశేషం.