రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. అది కూడా ఏకంగా 69 పరుగుల తేడాతో ఈ సీజన్లోనే భారీ వ్యత్యాసంతో ఘన విజయం సాధించింది. చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆల్ ఆటతో ఆర్సీబీని దెబ్బ తీశాడు. తొలుత బ్యాటింగ్‌లో, ఆ తర్వాత బౌలింగ్‌లో సూపర్ ఫామ్ చూపించి చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో ధోనీ, రైనా మధ్య జరిగిన ఓ సంభాషణ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని ట్వీటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 191 పరుగులు చేయగా, ఆర్సీబీ 122 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ క్యూ కట్టింది.రవీంద్ర జడేజా 3 వికెట్లతో అదరగొట్టగా.. తాహీర్ 2 వికెట్లు సాధించాడు. శామ్ కరాన్, శార్దూల్ ఠాకూర్‌లకు చెరో వికెట్ లభించింది. చెన్నై బౌలర్ల విజృంభణతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కనీస పోటీ ఇవ్వలేక ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆర్సీబీ వికెట్లు వరుసగా పడుతూ సీఎస్‌కే గెలుపు ఖాయమైన వేళ ఆ జట్టులో చెన్నై ఆటగాళ్లు మైదానంలో ఫుల్ లో కనిపించారు. కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా తోటి ఆటగాళ్లతో జోకులు వేస్తూ సందడి చేశాడు.
ఈ క్రమంలోనే ఏబీ డివిలియర్స్ అవుటైన తరువాత హర్షల్ పటేల్ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో ధోనీ, రైనాల మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. వారు మాట్లాడిన మాటలు వికెట్ల వద్దనున్న మైక్‌లో రికార్డు కావడంతో ఇప్పుడవి నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా మ్యాక్స్‌వెల్, ఏబీ వంటి విదేశీ ఆటగాళ్లు క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ధోనీ హిందీలో మాట్లాడుతూ.. ఫీల్డింగ్ సెట్ చేస్తాడు. అలా చేస్తే వారికి ధోనీ ప్లాన్ రివియల్ కాదు.
కానీ హర్షల్ పటేల్ భారతీయుడే కావడంతో.. ఆ సమయంలో కూడా హిందీలో ఫీల్డింగ్ పెడితే అతడికి అర్థం అయిపోతుంది. అందుకే ధోనీ.. తాను ఇక హిందిలో ఫీల్డింగ్ పెట్టనంటూ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనాతో అన్నాడు. అప్పటికే విజయం ఖరారైపోవడంతో రైనా ఈ మాటలకు తెగ నవ్వాడు. ధోనీ కామెంట్స్‌పై కామెంటేటర్లు కూడా నవ్వడం కొసమెరుపు.