ఇక ఈ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ఈ స్థానానికి పోటీ చేసింది. మాజీ సీఎస్ రత్నప్రభను బరిలో నిలిపారు. తొలుత బీజేపీ మాత్రమే ఇక్కడ పోటీ చేస్తుందని, జనసేనతో కలవడం లేదని వార్తలొచ్చాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలు తెంచుకునే దాకా తెచ్చుకోవద్దనే విధంగా హెచ్చరించడంతో బీజేపీ వెనక్కు తగ్గింది. రెండు పార్టీలు కలిసి నిర్ణయించిన రత్నప్రభను ఎన్నికల బరిలో నిలిపింది. దాదాపు 30వేల ఓట్ల వరకు కొల్లగొట్టింది. దీంతో బీజేపీ బలం పెరిగిందని ఆ పార్టీ తెగ సంబరపడిపోతోంది. కానీ నిజానికి ఇది బీజేపీ బలమా..? అంటే కాదనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ సారి ఓట్లశాతం పెరిగినా ఆ పెరిగిన ఓట్లు జనసేన వల్ల పెరిగినవే కానీ, బీజేపీకి దక్కినవి కావని విశ్లేషకుల మాట.
ఆంధ్రాలో వైసీపీకి టీడీపీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోవడం, సరైన ప్రత్యర్థి కరువవ్వడంతో వైసీపీ ఏకఛత్రాధిపత్యంగా దాష్టీకాలకు దిగే అవకాశం ఉండడంతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వారికి జనసేన పూర్తి స్థాయి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో.. రాజకీయంగా అనుభవం లేదనే ఒకే ఒక్క కారణంతో ప్రజలు పవన్‌ను పక్కన పెట్టారే తప్ప, ఆయనకు అధికారం ఇవ్వడం ప్రజలకు ఇష్టం లేక కాదని కొందరి అభిప్రాయం. వైసీపీకి ప్రధాన పోటీ ఏ పార్టీ అంటే అది జనసేన మాత్రమే అనే విధంగా ప్రజల్లో ఇప్పటికే అభిప్రాయం పడిపోయిందని, ఇక తాజాగా తిరుపతిలో వచ్చిన ఫలితాలతో ఈ విషయం మరోసారి రుజువైందని వారంటున్నారు.
2019లో తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 9206 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈ సారి బీజేపీ-జనసేనల ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు 26,992 ఓట్లు దక్కాయి. అప్పటితో పోల్చితే 17,786 ఓట్లు అధికంగా సాధించిన 5.82 శాతం ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు చేసింది. గతంతో పోలిస్తే 4.146 శాతం ఓట్లు పెరిగాయి. అయితే ఈ ఓట్లు బీజేపీ సొంత బలం కాదని, జనసేన పార్టీపై ప్రజలకున్న అభిమానం అని విశ్లేషకుల మాట. దీనిని బట్టి చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుందని, వైసీపీకి జనసేన కచ్చితంగా చెమటలు పట్టిస్తుందని ఇప్పటికే అనేకమంది అంచనా వేస్తున్నారు.