లక్నో: ఇటీవల ఓ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఓ పంచాయతీ నుంచి పోలీసులు 20 కేజీల రసగుల్లలను సీజ్ చేశారు. ‘రసగుల్లల్లో ఏముంటుంది..? వాటిని సీజ్ చేయడమేంట’ని హైరానా పడకండి. ఎందుకంటే దీని వెనక కూడా కరోనానే ఉంది. అయితే ఆ రసగుల్లల్లో కరోనా వైరస్ ఏమీ లేదు. కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఈ రసగుల్లలను కూడా సీజ్ చేశారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. కఠినమైన కరోనా నిబంధనల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు కూడా 144 సెక్షన్ నిబంధనల మధ్య వెల్లడించారు. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కానీ, ఫలితాలు వెల్లడైన తరువాత కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ సంబరాలు చేసుకోకూడదని, విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించారు.
కానీ ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ పంచాయతీలో విజయం సాధించిన అభ్యర్థి తరపున ఇద్దరు వ్యక్తులు సంబరాలు చేసుకుంటూ రసగుల్లలను పంచుతూ తిరిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి వారి నుంచి దాదాపు 20 కేజీల రసగుల్లలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా వెల్లడించారు. ‘సీఆర్‌పీసీ సెక్షన్ 144 నిబంధనను అతిక్రమించినందుకుగానూ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, పంచాయతీ ఎన్నికల్లో విజయం అనంతరం జనాలను ఒకచోట చేర్చి వారికి రసగుల్లలు పంచుతూ సంబరాలు చేసుకుంటుండడంతో అరెస్టు చేశామని తెలిపారు. వారి నుంచి 20 కేజీల రసగుల్లలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
‘అయితే ఆ రసగుల్లలు ఏమయ్యాయని మాత్రం అడగకండి.’