దేశంలో కరోనా రెండో వేవ్ ధాటికి దేశం అల్లకల్లోలం అవుతోంది. ప్రతి రోజూ లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలా ప్రాణాలు పోగోట్టుకుంటున్న వారిలో చాలా మంది ప్రాణ వాయువు కొరత వల్లనే కావడం శోచనీయం. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వల్ల వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం వివిధ మార్గాల ద్వారా ఆక్సిజన్‌ను సేకరించి అందించేందుకు ప్రయత్నిస్తోంది. తమ ఆధీనంలో ఉన్న ప్రాణ వాయువును రాష్ట్రాలకు కేటాయించి రవాణా చేసింది.
కాగా.. దేశం ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరతను అధిగమించడంలో ఇప్పటివరకు కేరళ ప్రధాన పాత్ర పోషించింది. తన వద్ద ఉన్న ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు రవాణా చేసి ఎన్నో లక్షల ప్రాణాలు కాపాడింది. అయితే ఇక మీదట తాను ఆక్సిజన్ సరఫరా చేయలేనని, తన వద్ద ఉన్న బఫర్ స్టాక్ ఆక్సిజన్‌ను కూడా ఇతర రాష్ట్రాలకు పంపించేశానని తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రత్యేకంగా ఓ లేఖ ద్వారా వెల్లడించారు. దీంతో కేరళ వెనక్కి తగ్గితే ఇప్పుడు మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
మే 6న జరిగిన ఆక్సిజన్ కేటాయింపుల్లో కేంద్ర కమిటీ నిర్ణయం ప్రకారం తమిళనాడుకు మే 10వ తేదీ వరకు 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దీనికి కేరళ కూడా ఆమోదం తెలిపింది. అయితే నేడు(మంగళవారం)తో ఈ కేటాయింపు ముగిసింది. దీంతో రేపటి నుంచి ఆక్సిజన్‌ను రాష్ట్రం బయటకు సరఫరా చేయడం కుదరదని పినరయి విజయన్ తన లేఖ ద్వారా కేంద్రానికి తేల్చి చెప్పారు.
అంతేకాకుండా ‘ప్రస్తుతం మా వద్ద కేవలం 86 మెట్రిక్ టన్నుల బఫర్ మాత్రమే మిగిలి ఉంది. రాష్ట్రంలో 4 లక్షల కేసులు ఉన్నాయి. మే 15 నాటికి ఈ కేసుల సంఖ్య 6 లక్షలకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా మే 15 నాటికి రాష్ట్రానికి 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంది. అలాగే రోజుకు దాదాపు 219 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ప్రధాన ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్ కోజికోడ్ ఉత్పత్తి సామర్థ్యం 150 మెట్రిక్ టన్నులుగా ఉంది. దీంతో పాటుగా ఇతర చిన్న యూనిట్ల ఉత్పత్తి ఆక్సిజన్ కూడా రాష్ట్రానికి అవసరం. అందువల్ల ఇతర రాష్ట్రాలకు అందించలేం’ అంటూ పినరయి విజయన్ తన లేఖలో పేర్కొన్నారు. మరి ఇలాంటి సమయంలో కేంద్రం రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.