బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్త ఇప్పుడు బ్రిటీష్ మీడియాలో సంచలనంగా మారింది. బోరిస్ తన నెచ్చెలి క్యారీ సైమండ్స్‌ను శనివారం రహస్యంగా పెళ్లాడినట్లు అనేక పత్రికలు వరుస కథనాలు ప్రచురించాయి. లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్లో వీరిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగిందని, మధ్యాహ్నం 1గం.30ని సమయంలో బోరిస్-సైమండ్స్ వివాహం జరిగిందని ది సన్, మెయిల్ ఆన్ సండేవర్క్ లాంటి వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో పెళ్లి కార్యక్రమానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉండడం వల్ల అతి కొద్ది మంది ఆహుతుల మధ్య వివాహం జరగగా, సీనియర్ సభ్యులతో సహా ఎవరికీ ఆహ్వానం అందలేదని సదరు పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై బోరిస్ జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయ ప్రతినిధిని సంప్రదించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
కాగా.. 2020 ఫిబ్రవరిలో తామిద్దరం నిశ్చితార్ధం చేసుకున్నామని 56 ఏళ్ల జాన్సన్, 33 ఏళ్ల సైమండ్స్ మీడియాముఖంగా ప్రకటించారు. వీరికి ఇప్పటికే ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. 2019లో జాన్సన్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరూ డౌనింగ్ స్ట్రీట్లో కలిసి నివసిస్తున్నారు. 1822లో లార్డ్ లివర్‌పూల్ తర్వాత బ్రిటన్ ప్రధాని పదవిలో ఉంటూ వివాహం చేసుకున్న తొలి వ్యక్తి బోరిస్ జాన్సన్.
ఇదిలా ఉంటే.. జాన్సన్‌కు ఇది మూడో వివాహం. ఆయన రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. అయితే తనకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పేందుకు నిరాకరించారు. జాన్సన్ చివరి వివాహం మెరీనా వీలర్ అనే న్యాయవాదితో జరిగింది. వీరికి నలుగురు సంతానం ఉండగా.. ఇద్దరు విడిపోయినట్లు 2018 సెప్టెంబర్‌లో ప్రకటించారు. అనంతరం 2019లో ప్రధాని అయ్యాక డౌనింగ్ స్ట్రీట్లో తన గర్ల్‌ఫ్రెండ్ సైమండ్స్(33)తో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జులైలో వీళ్ల పెళ్లి జరగొచ్చని కథనాలు అనేక పత్రికలు కథనాలు రాశాయి. అయితే ఇప్పుడు హడావుడిగా పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.