ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. గొప్ప వాళ్లమైనా తమ గొప్పతనాన్ని తామే చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకోకూడదని దానర్థం. కానీ ఇది పాకిస్తాన్ ఏ మాత్రం పట్టించుకోదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అసలు ఏమీ సాధించకుండానే తాము గొప్పోళ్లమని తెగ డబ్బా కొట్టుకుంటుంది. క్రికెట్ విషయంలోనూ ఆ దేశ క్రికెటర్లు, మాజీలు ఇదే విధానాన్ని పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ తమ జట్టే విశ్వ క్రికెట్‌లో నెంబర్ వన్ అంటూ బీరాలు పోయాడు. రానున్న రోజుల్లో అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ జట్టు నెం.1 జట్టుగా అవతరించబోతోందని కూడా రజాక్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆటతీరును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందంటూ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో, పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకుంది. దాంతోపాటుగా 4మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. కాగా ఇటీవల ఆ దేశంతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-1తో గెలిచింది. ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో కూడా 2 మ్యాచులను గెలిచి ఆధిక్యంలో నిలిచింది. కాగా.. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు టెస్ట్ క్రికిట్‌లో 5వ స్థానంలో, వన్డేలో 6వ స్థానంలో, టీ20ల్లో 4వ స్థానంలో కొనసాగుతోంది.
అయితే రజాక్ వ్యాఖ్యలపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా సీనియర్లు, కీలక ఆటగాళ్లంతా భారత్‌లో ఐపీఎల్ ఆడుతుండగా.. ఆ దేశ ఏ జట్టుపై పాక్ గెలిచిందని, ఇక ప్రపంచ క్రికెట్లో జింబాబ్వే ఎంత బలమైన జట్టులో అందరికీ తెలిసిందేనని, అలాంటి జట్లపై గెలిచి తాము నెంబర్ వన్ అవుతామని చెప్పడం ఒక్క పాక్‌కు మాత్రమే చెల్లిందని, అయితే అంతకుముందు ఆసీస్, కివీస్‌లతో జరిగిన సిరీస్‌లలో పాక్ ఎంత దారుణంగా ఆడిందో గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.