టీమిండియా మాజీ ఆటగాడు, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తన ఫ్యాన్స్‌కు తీపికబురందించారు. తన జీవితాన్ని ఓ పుస్తకంగా బయటకు తీసుకురాబోతున్నాడు. ‘బిలీవ్: వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మి’(నమ్మకం: జీవితం, క్రికెట్ నాకేం బోధించిందంటే) అనే పుస్తకంగా రైనా జీవితం మన ముందుకు రాబోతోంది. ఈ పుస్తకం మే 24న విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని రాయడంలో రైనా రచయిత, పాత్రికేయుడు భరత్ సుందరేశన్ సహాయం అందించారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
ఈ పుస్తకంలో రైనా తన జీవితంలోని అనేక విషయాలను పొందుపరిచాడు. యువ క్రికెటర్‌గా ఉన్నప్పుడు సురేశ్ రైనా ఎదుర్కొన్న సవాళ్లను వివరించాడు. అలాగే సీనియర్ క్రికెటర్లైన రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ నుంచి మైదానం, మైదానం ఆవల నేర్చుకున్న పాఠాలను రైనా ఈ పుస్తకంలో వివరించిన్లు తెలుస్తోంది. అంతేకాకుండా చిన్నప్పుడు పాఠశాలలో ఎదుర్కొన్న విషయాలనూ పొందుపరిచాడు. అలాగే ఆ సమయంలో క్రికెట్ శిబిరాల్లో ఎదుర్కొన్న అవమానాలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న అనుబంధాల గురించి ఈ పుస్తకంలో చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఈ పుస్తకాన్ని గురువారం విడుదల చేయబోతున్న నేపథ్యంలో సురేశ్ రైనా తన సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ‘బిలీవ్.. క్రికెట్ కలలను నిజం చేసుకొనేందుకు సాగించిన అంతర్గత ప్రయాణం. బిలీవ్.. నీలో అత్యుత్తమ గుణాలను ఆవిష్కరించేందుకు అవసరమైంది. బిలీవ్.. సరిహద్దులను దాటేసి నీపై నీకు విశ్వాసం ఉంటే..’ అంటూ రైనా తన పుస్తకం గురించి పేర్కొన్నాడు.
కాగా, ఎంఎస్ ధోనీతో వీడ్కోలు పలికిన రైనా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడాడు. గతేడాది వ్యక్తిగత కారణాలతో దూరమైన అతడు తిరిగి చేరాక ఆ జట్టు బలం మరింత పెరిగింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో చెన్నై రెండో స్థానంలో నిలిచింది.