దేశాన్ని కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేస్తోంది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు ప్రతి రోజూ సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అనేక ఔషధాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. కరోనా మహమ్మారితో పోరాడేందుకు డీఆర్డీవో సరికొత్త ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల రష్యా సంస్థ స్పుత్నిక్ మన దేశంలోని వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో చేరింది. అయితే తాజాగా దేశీయ సంస్థ డీఆర్‌డీఓ కరోనా నివారణకు ఔషదాన్ని తయారు చేసింది. 2డీజీ అనే ఈ ఔషధాన్ని ఇటీవలే డీఆర్డీవో తయారు చేసింది. ఈ ఔషధాన్ని ఈ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ ఔషదాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌కు రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చారు. అయితే ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాకు అందించారు.
2డీసీ ఔషధాన్ని విడుదల చేసిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయడం గొప్ప విషయమని అన్నారు. ‘దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. మహమ్మారిని అరికట్టేందుకు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు దాదాపు ఏడాది శ్రమించి ఈ ఔషధాన్ని తయారు చేశారు. ఈ ఔషధాన్ని హైదరాబాద్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలోని విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయడం ఆరోగ్యకరమైన భాగస్వామ్యానికి నిలువెత్తు నిదర్శన’మని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. 2డీజీ ఔషధం కరోనా రికవరీ సమయాన్ని తగ్గించడమే కాకుండా, అధిక ఆక్సిజన్ వినియోగానికి కూడా అడ్డుకట్ట వేస్తుందని అన్నారు. కాగా.. ఈ ఔషధం ధరను డీఆర్‌డీఓ ఇంకా నిర్ణయించలేదని ఆయన హర్ష వర్ధన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కరోనాను కట్టడి కోసం డీఆర్డీవో ఏడాది పాటు కష్టపడి 2డీజీ (2-డయాక్సీ డీ-గ్లూకోజ్) ఔషధాన్ని తయారు చేసింది. గతంలో దీనిని క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు తయారుచేశారు. ఈ ఔషధం క్యానర్స్ కణానికి గ్లూకోజ్ అందకుండా చేస్తుందని శాస్త్రవేత్తల మాట. ఇప్పుడు అదే సూత్రాన్ని అన్వయించుకొని డీఆర్డీవో ఈ సరికొత్త కరోనా నిర్మూలన ఔషధాన్ని తయారు చేసింది. కణాలకు గ్లూకోజ్ అందకపోతే, వాటి కణ విభజన నిలిచిపోతుంది. దాని కారణంగా కరోనా వ్యాప్తి జరగదు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ ఔషధం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణుల మాట. దీని ధరను అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.