భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా రెండు జాతీయ జట్లతో బరిలోకి దిగనుంది. ప్రధాన జట్టు కోహ్లీ సారథ్యంలో ఇంగ్లండ్ బయలుదేరనుండగా.. రెండో జట్టు శ్రీలంక బయలు దేరనుంది. కోహ్లీ సేన ఇంగ్లండ్‌లో కివీస్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. రెండో జట్టు శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు రెడీ అవుతోంది. కాగా.. ఇంగ్లండ్ వెళ్లే జట్టుకు ఎప్పటిలానే విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండనున్నారు. ఇక రెండో జట్టుకు కెప్టెన్ ఎవరో తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే శిఖర్ ధవన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
టీమిండియా జూలైలో శ్రీలంక పర్యటనకి వెళ్లబోతోంది. ఈ జట్టుకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు కెప్టెన్సీపై కూడా ఫోకస్ పెట్టింది. శ్రేయాస్ అయ్యర్ జట్టులో ఉండి ఉంటే కచ్చితంగా కెప్టెన్ అయ్యేవాడు. కానీ అతను గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో కెప్టెన్సీ రేసుకు శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ధవన్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై అనేకమంది మాజీలు సూచనలు పంపడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్ గబ్బర్‌కే ఓటు వేశాడు. ధావన్‌కు కెప్టెన్సీలో మంచి అనుభవముందని అన్నాడు.
”కెప్టెన్‌గా శిఖర్ భాయ్ గుడ్ ఛాయిస్. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా అతను టీమిండియాకి ఆడుతున్నాడు. అలానే టీమ్‌లో ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ కూడా. కాబట్టి.. శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేయడమే సమంజసం. సీనియర్ ప్లేయర్ కావడంతో ఆటగాళ్లు కూడా అతడ్ని గౌరవిస్తారు. కెప్టెన్‌ని ఆటగాళ్లు గౌరవించాలి. ఇక ధావన్‌కు గతంలో ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది” అని చాహర్ చెప్పుకొచ్చాడు.
ఇక దీపక్ చహర్ శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. చాహర్ ఐపీఎల్ 14వ సీజన్లో
సీఎస్‌కు తరపున దుమ్మురేపాడు. సీఎస్కేకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా రెండో జట్టు జులై 13 నుంచి 27 లంకలో పర్యటించనుంది.