క్రికెట్, సినిమా.. ఇలా ప్రతి రంగంలోనే వారసులు అడుగు పెట్టడం సర్వసాధారణమే. అయితే వారు ఎంతలా రాణించారనే దారిపైనే స్థానం లభిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులోకి కూడా ఇలాంటి వారసులే అడుగుపెడుతున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు అజమ్ ఖాన్ కొద్ది కాలం క్రితం నుంచి బాగా రాణిస్తున్నాడు. అయితే అధిక బరువు ఉండడంతో అతడికి జాతీయ జట్టులో స్థానం లభించడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇంత బరువు ఉంటే కష్టమని.. ఫిట్‌నెస్ కాపాడుకోలేవని.. జాతీయ జట్టులోకి రావడం కష్టమేనంటూ పలువురు మాజీ క్రికెటర్లు అతడిపై విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ ఆటగాడు మహ్మద్ యూసఫ్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో.. అజమ్ ఖాన్‌ను ప్రశంసిస్తూనే అతనికి కొన్ని సలహాలు ఇచ్చాడు. ”అజమ్ ఖాన్ ఆటతీరు నాకు బాగా నచ్చింది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే అతని ఆటతీరును గమనించాను. అజమ్ అలవోకగా సిక్సర్లు బాదగలడు. అయితే అది అతడి కలిసొచ్చే అంశమే కాదు.. నష్టపరిచే అంశం కూడా. ప్రతిసారి, ప్రతి షాట్ సిక్సర్‌గా మారుతుందన్న నమ్మకం లేదు. కానీ అతని షాట్ల ఎంపిక విధానం.. కవర్ డ్రైవ్ ,ఆన్‌డ్రైవ్ షాట్లు బాగున్నాయి. టీ20 అంటేనే బాదుడు ఉంటుంది. కానీ పరిమిత ఓవర్లు క్రికెట్‌లో ప్రతీసారి సిక్స్ కొట్టాల్సిన అవసరం ఉండదు.
స్కోరు మంచి స్పీడులో ఉంటే సిక్సర్లతో పనేముంటుంది. టైమింగ్, షాట్ మూమెంట్స్‌ను కరెక్ట్‌గా ఎంచుకుని ప్రయోగించాలి. ఆ విషయంలో అజమ్ కాస్త వెనుకబడి ఉన్నాడు. దీని నుంచి అజమ్ బయటపడాలంటే.. కోహ్లీ, విలియమ్సన్, బాబర్ అజమ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్ల ఆటతీరును పరిశీలించాలి. అప్పుడే అతడు పరిపూర్ణ ఆటగాడవుతాడం’టూ యూసఫ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అజామ్ బరువు ఎక్కువగా ఉండడం అతడికి పెద్ద దెబ్బని, అది తగ్గించుకుని ఫిట్‌గా తయారైతే సగం ఒత్తిడి తగ్గినట్లేనని అన్నాడు. ఒకవేళ ఆజమ్ జాతీయ జట్టుకు ఎంపికైతే మాత్రం బ్యాటింగ్‌లో మంచి స్టార్‌గా ఎదుగుతాడని, అందులో ఎలాంటి సందేహం లేదని ప్రశంసించాడు.
కాగా.. ఇటీవల జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అజమ్ ఖాన్ చెలరేగి ఆడాడు. క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అజమ్ 5 మ్యాచ్‌ల్లో 98 పరుగులు సాధించాడు. అయితే కరోనా కారణంగా లీగ్ వాయిదా పడడంతో టోర్నీలో మిగతా మ్యాచ్‌లు జరగలేదు. అయితే భారీ కాయంగా కనిపిస్తున్నా అజమ్ ఖాన్ సిక్సర్లు కొట్టడంలో మాత్రం దిట్ట. క్రీజు కదలకుండానే అలవోకగా భారీ సిక్సర్లు బాదడం అతడికి వెన్నతో పెట్టిన విద్య.