ప్రతి పూటా భోజనం లేకపోయినా, కంటి నిండా నిద్ర లేకపోయినా పర్లేదు కానీ.. అరక్షణం కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే గడపలేని పరిస్థితి తలెత్తింది ప్రస్తుతం యువతలో. దీనినే స్మార్ట్‌ఫోన్ వ్యసనం (డీఎస్‌ఎం) డయాగ్నోస్టిక్ – స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అంటారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జూదం, మాదకద్రవ్య వ్యసనాల్లానే స్మార్ట్ ఫోన్ కోసం వ్యసనపరులుగా మారతారట పిల్లలు. తాజాగా ఇదే డిజాస్టర్ కారణంగా ఓ కుటుంబం లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. కొడుకు చేసిన పనితో ఆర్థికంగా కుదేలైంది.
వివరాల్లోకి వెళితే.. గీత, సాగర్(మార్చిన పేర్లు) ఇద్దరూ ఉద్యోగస్తులు. మంచి జీతం. ఒక్కడే కొడుకు. ప్రశాంతమైన జీవితం. అయితే కరోనా దెబ్బకు గీత ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. సాగర్ ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయినా ఎలాంటి చింతలూ లేకుండా గడిపేస్తున్నారు. కానీ ఓ రోజు ఇద్దరి క్రెడిట్ కార్డు బిల్ వచ్చింది. అది చూసిన గీత, సాగర్ ఇద్దరికీ గుండె ఆగినంతపనైంది. ఇద్దరి క్రెడిట్ కార్డుల్లో కనీసం రూ.6 లక్షల వరకు బిల్ వచ్చింది. దీంతో తమ ఖాతా హ్యాక్ అయిందని వారిద్దరూ సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించారు. అయితే అసలు విషయం తెలిసి వారిద్దరూ షాకయ్యారు. ఎందుకంటే అంత అప్పు చేసింది వారి కొడుకే.
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారి, తల్లిదండ్రులకు తెలియకుండా వారి క్రెడిట్ కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవాడు. ఓటీపీ వచ్చే సమయంలో సైలెంట్‌గా వాళ్ల ఫోన్లు తీసుకుని ఓటీపీ చూసి ఆ మెసేజ్ డిలీట్ చేసేసేవాడు. దీంతో ఇన్నాళ్లు విషయం బయటకు రాలేదు. గీత ఉద్యోగం చేసినన్నాళ్లు కొడుకుకు ప్రతి నెలా రూ.4వేల పాకెట్ ఇచ్చేవారు. ఆ మనీతో ఆన్‌లైన్ గేమ్స్ కొనుక్కునే అతడు.. గీత ఉద్యోగం వదిలేసిన తర్వాత ఆ పాకెట్ మనీ రావడం ఆగిపోయింది. దీంతో వారి క్రెడిట్ కార్డులను తీసుకుని గేమ్స్ కొని ఆడడం ప్రారంభించాడు. మొదట తక్కువ మొత్తంలో చేసినా.. తర్వాత్తర్వాత ఇది లక్షలకు చేరింది. దీంతో విషయం బయటపడింది.
కాగా.. దీనిపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన ఓ పరిశోధనలో ఈ డీఎస్ఎం ఎడిక్షన్ గురించి బయటపడింది. దీనివల్ల ఏదో కోల్పోతున్నామనే భయం, ఆందోళన, అసంతృప్తి, సామాజిక ఆందోళన, ఒత్తిడి వంటివి వారిలో అధికంగా ఉంటాయని తేలింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా వాడే పిల్లలకు సరైన గైడెన్స్, కౌన్సెలింగ్ ఇచ్చి వారిని దారిలో పెట్టుకోవచ్చని నిపుణులు గైడెన్స్ చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.