క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అర్ధంతరంగా వాయిదా పడిన ఐపీఎల్-14 త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్-అక్టోబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అధికారికంగా ప్రకటించారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో శనివారం జరిగిన వర్చువల్ జనరల్ మీటింగ్‌లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది చివర్లో భారత్‌లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీని మరో నెల రోజుల గడువు కోరనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఈ సమావేశంలో కేవలం ఐపీఎల్ నిర్వహణపైనే చర్చించినట్లు సమాచారం. ఐపీఎల్ 14వ సీజన్‌లో ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తికాగా ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వాటిని సెప్టెంబర్ 18 లేదా 19న ప్రారంభించి అక్టోబర్ 9 లేదా 10వ తేదీన ఫైనల్‌తో ముగించాలనే ఆలోచనతో బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది సైతం సెప్టెంబర్‌లోనే యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ కూడా యుఏఈలో జరిగితే వరుసగా రెండు సార్లు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఘనత యూఏఈకి దక్కుతుంది.
కాగా.. భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18 లేదా 19 నుంచి షార్జా, అబుదాబి, దుబాయ్‌లలో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో భారత్, ఇంగ్లండ్ క్రికెటర్లు నేరుగా ఇంగ్లండ్ నుంచి దుబాయ్‌కి వెళ్లనున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీని బీసీసీఐ మరో నెల రోజుల వ్యవధి కోరనున్నట్లు సమాచారం.