అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో బ్యాటింగ్ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, జట్టులో స్థానం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని టీమిండియా స్టార్ ఆల్‌రండర్ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. అయితే కెరీర్లో ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని ఆకాశానికెత్తేశాడు. కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో చాలా తికమక పడేవాడినని, ఆ సమయంలో షాట్ పిచ్ బంతులను ఆడాలంటూ ధోని సలహా ఇచ్చాడని, దాంతో తన బ్యాటింగ్ మారిపోయిందని జడేజా చెప్పాడు.
‘కెరీర్ మొదట్లో షాట్ ఆడాలా..? వద్దా? ఏ బంతికి ఏ షాట్ ఆడాలి? బంతిని వదిలేద్దామా? ఆడదామా? వంటి ప్రశ్నలతో మైండ్ అంతా నిండిపోయేది. అదే తికమకలో బ్యాట్ ఊపి వికెట్ పారేసుకునేవాడిని. కానీ 2015 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ధోనీ ఓ విలువైన సలహా ఇచ్చాడు. షార్ట్ పిచ్ బంతులను ఆడడంపై ఫోకస్ చేయాలని సూచించాడు. దాంతో నా బ్యాటింగ్ పూర్తిగా మారిపోయింది. కెరీర్‌లో ప్రస్తుతం నేను అనుభవిస్తున్న హోదాకు ధోనినే కారణం’ అని జడేజా ఆకాశానికెత్తేశాడు.
కాగా.. రవీంద్ర జడేజా ఇప్పుడు కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. బంతితో వికెట్లు తీస్తూ బ్యాటుతోనూ విలువైన పరుగులు చేస్తున్నాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటుతో అదరగొడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నాడు. రెండేళ్లుగా జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. ఇటీవల వాయిదా పడిన ఐపీఎల్‌లోనూమెరుపులు మెరిపించి చెన్నై విజయాల్లో కీలక ఆటగాడనిపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్ట్‌ల సిరీస్‌లకు గానూ టీమిండియాలో స్థానం సంపాదించాడు.