క్రికెట్‌లో ప్రపంచకప్ అంటే ఆ స్థాయే వేరు. అది వన్డే అయినా.. టీ20 అయినా.. ఏదయినా.. ప్రపంచకప్ అంటే క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ టోర్నీ ఆడే జట్లు కూడా టోర్నీ విజేతగా నిలవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. అయితే చిన్న చిన్న జట్లకు ఈ టోర్నీలో ఆడేందుకు అంతగా అవకాశం లభించదు. దీనికోసం చిన్న దేశాల జట్లన్నీ క్వాలిఫయర్స్ ఆడి.. అందులో విజయం సాధించిన టాప్ జట్లు మెగా టోర్నీలో అడుగుపెడగాయి. మిగిలిన జట్లన్నీ ఇంటిదారి పడతాయి. అయితే ఇకపై మరిన్ని చిన్న జట్లకు అవకాశం కల్పించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఐసీసీ మెన్స్ పరిమిత ఓవర్ల టోర్నీల్లో కీలక మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఇప్పటివరకు ప్రపంచకప్ అంటే 8 జట్లు, 10 జట్లు.. మహా అయితే 12 జట్లు. కానీ ఇకపై అది 14 జట్లకు చేరనుంది. పురుషుల వన్డే ప్రపంచకప్ ఇకపై 14 జట్లతో నిర్వహించున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. 2027 ప్రపంచకప్ నుంచి ఈ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ నేడు అధికారిక ప్రకటన వెలువరించింది. 2027, 2031 ప్రపంచకప్ టోర్నీల్లో 14 జట్లు పోటీపడతాయని, మొత్తం జట్లు కలిపి 54 మ్యాచ్‌లు ఆడతాయని తెలిపింది.
అంతేకాకుండా మెన్స్ టీ20 ప్రపంచకప్ కూడా 20 జట్లతో నిర్వహిస్తామని వెల్లడించింది. 2024, 2026, 2028, 2030 ప్రపంచకప్ ఎడిషన్లలో 20 జట్ల చొప్పున పాల్గొంటాయని, ప్రతి టోర్నీలోనూ 55 మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించింది. ఇదే జరిగితే హాంకాంగ్, బెర్ముడా, స్కాట్‌ల్యాండ్, కెన్యా వంటి చిన్న జట్లను మళ్లీ ప్రపంచకప్ టోర్నీలో చూసే అవకాశం ఉంది.