నాసాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని వ్యోమగాముల కోసం ఆహారాన్ని స్పేస్ఎక్స్ గురువారం పంపిస్తోంది. ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ కార్గోను ఐఎస్ఎస్‌కు స్పేస్ఎక్స్ పంపిస్తోంది. ఇది బూస్టర్ రాకెట్లను మళ్లీ మళ్లీ ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందింది. ఫాల్కన్-9 రాకెట్‌ను కూడా ఈ ఏడాది చివర్లో క్రూ-3 మిషన్ కోసం మరోసారి ఉపయోగించబోతోంది. ఈ కార్గోను డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా పంపిస్తారు. అంతరిక్ష కేంద్రానికి కార్గోను తీసుకెళ్ళడానికి మోడ్రన్ టెక్నాలజీతో రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్ డ్రాగన్.
భూమి చుట్టూ తిరుగుతున్న ఈ అతిపెద్ద స్పేస్ లేబొరేటరీకి అవసరమైన సైన్స్, పరిశోధనకు సంబందించిన సరఫరాలను, సిబ్బందిని కూడా పంపిస్తుంటారు. కాగా ఇప్పటికే 21 సార్లు ఇలా పంపగా.. ఈ సారి 22వ సారి. మొత్తం 3,300 కిలోల వస్తువులను పంపిస్తున్నారు. అందులో 341 కిలోగ్రాముల ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. వీటిలో ఆపిల్స్, నారింజలు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, అవకడోలు, స్టాండర్డ్ మెనూ ఫుడ్ కంటెయినర్స్, క్రూ స్పెసిఫిక్ మెనూ, కాఫీ, టీ వంటివి కూడా ఉన్నాయి.
కాగా.. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి వీటిని పంపించనున్నారు. ఇది తిరిగి జూలైలో భూమిపైకి వస్తుంది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రం తూర్పు తీరానికి చేరుకుంటుంది. దాదాపు 2,404 కిలోగ్రాముల ఎక్స్‌పెరిమెంట్ శాంపుల్స్, కార్గోలను తీసుకొస్తుంది.