కరోనా దెబ్బకు ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా ఆగిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా వారి వారి దేశాలకు బయలుదేరి వెళ్లిపోయారు. వాయిదా పడే సమయానికి టోర్నీలో ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లను మళ్లీ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. అది కూడా 13వ సీజన్ నిర్వహించిన యూఏఈలోనే ఈ టోర్నీని కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ ఆయా దేశాల ఆటగాళ్లంతా రెడీ కావాల్సి వస్తోంది. కానీ ఈ సెకండ్ షెడ్యూల్‌కు కొన్ని దేశాల ఆటగాళ్లు ఈ సెకండ్ షెడ్యూల్‌కు అందుబాటులో ఉండరన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు బీసీసీఐకి చెందిన ఓ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటివరకు వారు ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని, మిస్ కాబోయే మ్యాచ్‌లకు ఎటువంటి జీతం చెల్లించబోమని ఆయన వెల్లడించారు. అయితే బీసీసీఐతో ఒప్పంద కుదుర్చుకున్న ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని తెలిపారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తిగా ఆడకుంటే విదేశీ ఆటగాళ్ల పారితోషికంలో కోత పెట్టే హక్కు ఫ్రాంచైజీలకు ఉంటుందని సదరు అధికారి తెలిపారు. ఫ్రాంచైజీల తాజా నిర్ణయంతో ఐపీఎల్‌కు డుమ్మా కొట్టాలనుకున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌కు చెందిన కొందరు క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్‌ల నేపంతో ఐపీఎల్ ఆడబోమని ఇప్పటికే చెబుతున్నారు. మరి ఈ ఫీజుల కోతతో అయినా వాళ్లంతా తిరిగి ఐపీఎల్‌కు వస్తారా..? లేదా అనేది వేచి చూడాలి.