ఉత్తరకొరియా ఆకలి చావులతో అల్లాడిపోతోంది. ఎటు చూసినా అష్టకష్టాల్లో ఉన్న ప్రజలు అన్నార్తులుగా మారి అర్థిస్తున్నారు. ఈ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఏనాడూ ఆహార సంక్షోభం లేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేనంత ఆహార సంక్షోభ పరిస్థితులను నార్త్ కొరియన్ ప్రజలు చవిచూస్తున్నారు. దీనికి కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ ప్రధాన కారణమైనా.. దాంతో పాటు తుఫానులు, వరదలు ముంచెత్తటంతో దేశం అల్లకల్లోలం అయింది. ఇది దేశ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా దేశంలో ఎక్కడ చూసినా ఆకలి చావులు పెరిగిపోయాయి. అయితే దేశంలో ప్రస్తుత పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యాలే కారణమైనా.. వాటిని ఎదుర్కోవడంలో దేశ అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్ గద్దెనెక్కిననాటి నుంచే ఉత్తరకొరియాలో ఈ ఆకలి సంక్షోభం ఎక్కువైందని గతంలో విడుదలైన రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయ.
కరోనాతో కిందటి ఏడాది తుపాన్లు, వరదలు దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీయగా.. కరోనా కొనసాగింపుతో ఈ యేడు మరింత దుస్థితికి చేరినట్లు తెలుస్తోంది. ఆకలి కేకలతో ఒకవైపు జనాలు అల్లలాడుతుంటే.. మరోవైపు లక్షల్లో మరణాలు సంభవిస్తున్నట్లు కూడా అక్కడి జర్నలిస్టుల వార్తల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ విషయాలను కూడా ఎప్పటిలానే బయటి ప్రపంచానికి తెలియకుండా కిమ్ దాచి పెడుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అయితే చైనా సరిహద్దులో అక్రమంగా సరుకులను రవాణా చేసే వారికి అడ్డుకట్ట పడడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.
దిగుమతులు నిలిచిపోవడంతోనే..
ఉత్తరకొరియాలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి ప్రధాన కారణం ఎగుమతి-దిగుమతులు పూర్తిగా నిలిచిపోవడమేనని తెలుస్తోంది. ఉత్తర కొరియా ప్రధానంగా రష్యా, చైనా నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా చైనా నుంచి 81 శాతం ఉత్పత్తులు వస్తుంటాయి. అలాంటిది కరోనా విజృంభణ ప్రారంభం నుంచే ఉత్తర కొరియా కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్ని మూసేసి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగింది. అయితే ఆకలి కేకల్ని, మరణాల్ని మాత్రం నిరోధించడంలో విఫలమైంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. పోయినేడాది 60 శాతం నార్త్ కొరియా ప్రజలు.. ఆకలితో అల్లలాడిపోయారు. ఉన్న నిల్వలు దగ్గర పడడంతో పాటు సెప్టెంబర్ నుంచి ఆ దేశానికి కొత్తగా సరుకులు వెళ్లింది లేదు అని యూఎన్వో ఒక నివేదికలో వెల్లడించింది.
ఈ పరిస్థితులతో నార్త్ కొరియా ప్రజలు కిమ్పై విశ్వాసం పూర్తిగా కోల్పోయారని కొన్ని కథనాలు ప్రస్తావించాయి. 70 శాతం ప్రజలకు ఉచిత రేషన్ హమీతో పాటు 2012 నుంచి ‘ప్రజల స్వేచ్ఛను హరించన’ని వాగ్దానం చేసిన కిమ్.. తర్వాతి కాలంలో దానిని పూర్తిగా విస్మరించాడని, ఇప్పుడు ఆకలితో జనాలు చస్తున్నా.. వేడుకలు, ఆర్భాటాలకు పోతున్నాడ’ని లియోన్ అనే చైనీస్ జర్నలిస్ట్ కథనం రాసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్భాట వేడుకలు, క్షిపణి పరీక్షలు పక్కనపెట్టి.. రష్యా, చైనా సరిహద్దుల్ని తెరవడం, ఐక్యరాజ్య సమితి అందించే తక్షణ సాయాన్ని వద్దనకుండా తీసుకోవడం మాత్రమే కిమ్ ముందు ఉన్న మార్గాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.