బిర్యానీ, పులావ్.. ఇవి భారత్, పాకిస్థాన్.. రెండు దేశాల్లో బాగా పాపులర్ అయింది బాస్మతీ రైస్. ఈ రెండు దేశాల నుంచే బాస్మతి బియ్యం ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ కలిగిన బాస్మతి రైస్‌పై పూర్తి హక్కులు దక్కించుకునేందుకు భారత్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. దానికి పాక్ అడ్డుపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే పొడవాటి బాస్మతి బియ్యం ఈ రెండు దేశాల మధ్య వివాదానికి కారణం అవుతోంది. తాజాగా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో బాస్మతి బియ్యం హక్కుల కోసం మరోసారి భారత్-పాక్ పోరాడుతున్నాయి. ఈ బియ్యం కోసం బాస్మతి రకంపై పూర్తి హక్కులు చెందేలా భారత్ ఈయూలో దరఖాస్తు చేసుకుంది. అయితే దీన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం.. ప్రపంచంలో భారత్ అత్యధికంగా బియ్యం ఎగుమతులు చేస్తోంది. ఈ ఎగుమతుల ద్వారా ఏడాదికి 6.8 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంటోంది. ఇక 2.2 బిలియన్ డాలర్ల విలువైన బియ్యం ఎగుమతులతో పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా బాస్మతి రకం బియ్యాన్ని ఎగుమతి చేసేది మాత్రం ఈ రెండు దేశాలే. అయితే బాస్మతి భౌగోళిక గుర్తింపుపై భారత్, పాక్ మధ్య చాలా కాలం నుంచే విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. యూరోపియన్ యూనియన్ ఎరువుల ప్రమాణ స్థాయిని కఠినతరం చేయడంతో మూడేళ్లుగా ఈయూకు భారత్ నుంచి వెళ్లే బాస్మతి ఎగుమతులు తగ్గాయి. ఇదే అదనుగా పాకిస్థాన్ తన ఎగుమతులను విస్తరిస్తోంది.
కాగా.. ప్రొటెక్టెడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్(పీజీఐ) హోదా లభిస్తే ఆ భౌగోళిక ప్రాంతానికి, అక్కడి ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు లభిస్తాయి. పేటెంట్ హక్కులు వస్తే నకిలీలు, దుర్వినియోగం నుంచి సదరు ఉత్పత్తులకు రక్షణ లభిస్తుంది. అలాగే గుర్తింపు స్టాంపుతో ప్రపంచ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. భారత్‌లోని డార్జిలింగ్ టీకి ఈ తరహా గుర్తింపు ఉంది. అందుకే ప్రపంచంలో చాలా దేశాలు ఉపయోగించే బాస్మతి భౌగోళిక గుర్తింపు కోసం భారత్, పాక్ దేశాలు పోటీపడుతున్నాయి. తాజాగా బాస్మతి రకంపై పూర్తి హక్కులు భారత్‌కే దక్కేలా యూపీలో ప్రొటెక్టెడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో తమ మార్కెట్ ప్రమాదంలో పడుతుందని భావించిన పాక్.. ఈ దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరుకుంది. దీంతో భారత్‌కు అనుకూలమైన ఫలితం వస్తే యూరోపియన్ యూనియన్‌లో బాస్మతి భౌగోళిక గుర్తింపు కోసం రెండు దేశాలు గతంలోనూ దరఖాస్తులు చేసుకోగా.. ప్రతిసారి రాజీ కుదిరింది. ఈసారి కూడా రెండు దేశాలు చర్చించుకుని ఒక పరిష్కారానికి రావాలని యూరోపియన్ కమిషన్ సూచించింది. ఇందుకోసం సెప్టెంబరు వరకు గడువు కల్పించింది. ఒకవేళ భారత్‌కు అనుకూల ఫలితం వస్తే బాస్మతి విషయంపై పాక్ యూరోప్ కోర్టులను ఆశ్రయించేందుకు కూడా రెడీ అవుతోంది.