తప్పు ఎప్పుడు చేసినా.. ఎప్పుడోకప్పుడు తప్పక శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అంటుంటారు పెద్దలు. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నాడు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఓటీ రాబిన్సన్. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రం చేసిన రాబిన్సన్ మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఈ క్రమంలోనే అతడి గురించి క్రికెట్ ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే 8ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో అతడు చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అతడి మెడకు చుట్టుకుంది. క్రికెట్ కెరీర్‌ను సైతం చిక్కుల్లో పడేసేలా ఉంది. 27 ఏళ్ల రాబిన్సన్ 2012-13లో ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. అందులో జాత్యాంహకార వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ ట్వీట్ బయటకు రావడంతో అతడిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) దర్యాప్తునకు ఆదేశించింది.
రాబిన్సన్ విషయంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ గ్రాహమ్ థోర్ప్ కూడా స్పందించాడు. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యే అటగాళ్లకు సంబంధించిన సోషల్ మీడియా హిస్టరీని కూడా క్రికెట్ బోర్డ్‌లు పరిశీలనలోకి తీసుకుంటాయేమోనంటూ అనుమానం వ్యక్తం చేశాడు. యువ క్రికెటర్లు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుల కారణంగా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఇది సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, రాబిన్సన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. యుక్త వయసులో మిడిమిడి జ్ఞానంతో ఆ తప్పు చేశానని, ఇప్పుడు తాను పరిణితి చెందానని, ఏదిఏమైనా తాను అలాంటి పక్షపాత వైఖరితో కూడిన జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అన్నాడు. ఈ సందర్భంగా సమాజం తనను మన్నించాలని క్షమాణలు కూడా కోరాడు.
ఇదిలా ఉంటే, బుధవారం న్యూజిలాండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌లో డెవాన్ కాన్వే అద్భుత ద్విశతకం సాయంతో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. మీడియం పేసర్ ఒలీ రాబిన్సన్(4/75), మార్క్ వుడ్(3/81), జేమ్స్ ఆండర్సన్(2/83)లకు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే డామినిక్ సిబ్లీ(0), జాక్ క్రాలీ(2)ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోరీ బర్న్స్(59 నాటౌట్), కెప్టెన్ జో రూట్(42 నాటౌట్) ఆదుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.