ఓ వ్యక్తి తన ఇంట్లో బర్త్ డే పార్టీ జరిపాడు. అందరినీ పిలిచి చక్కగా వేడుక చేసుకున్నాడు. అంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా చివర్లో అతడు చేసిన ఓ చిన్న తప్పు అతడిని పోలీసులకు పట్టించింది. కరోనా నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలోనే అతడిపై కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఓ ట్విస్ట్.. ఏంటంటే అతడు చేసిన బర్త్డే పార్టీ.. కొడుకుదో, కూతురిదో కాదు, ఇంట్లో గేదెది. అవును.. షాకయినా ఇది నిజం. థానేలోని బుందేర్లో జరిగిందీ ఘటన.
బుందేర్లోని దోంబీవలి ప్రాంతం, విష్ణునగర్ ప్రాంతంలో కిరణ్ మాత్రే అనే వ్యక్తి నివశిస్తున్నాడు. అయితే శుక్రవారం తన ఇంటిలోని పెంపుడు గేదెకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. ఈ వేడుకలకు స్నేహితులు, చుట్టుపక్కల వారిని అందరినీ ఆహ్వానించి చిన్నసైజు పార్టీ కూడా ఇచ్చాడు. వారితో కలిసి గేదెతో ఫోటోలు కూడా తీసుకున్నాడు. కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చెబుతూ వీడియోలు కూడా తీశాడు. అయితే ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు చిక్కు వచ్చిపడింది. వీటిలో ఓ ఫోటోలో గేదెతో కలిసి ఫోటో దిగిన వారిలో ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకోలేదు. ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించలేదు. దీంతో ఆ ఫోటోలను చూసిన పోలీసులు కిరణ్ మాత్రేపై కేసు నమోదు చేశారు.
FIR registered against a man who allegedly celebrated the ‘birthday’ of his buffalo despite #coronavirus restrictions in thane district of #Mumbai. pic.twitter.com/6hpzIoNYXm
— Kashmir News (@Kashmirnews22) March 13, 2021
ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో జరిగిన గేదె పుట్టినరోజు వేడుకలకు హాజరైనవారెవరూ మాస్కులు ధరించలేదని, సామాజిక దూరాన్ని కూడా పాటించలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఐపీసీ సెక్షన్ 269 కింద కిరణ్ మాత్రేపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అయితే దర్యాప్తు మాత్రం కొనసాగుతోందని వెల్లడించారు.