2007 ప్రపంచకప్ టీమిండిగా గెలవడం ఎంత చరిత్రగా చెప్పుకుంటారో.. ఆ సిరీస్‌లో ఇంగ్లీష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌పై యువీ కొట్టిన 6 సిక్సులు కూడా అదే స్థాయిలో చరిత్రలో నిలిచిపోతాయి. అయితే యువీ ఆ స్థాయిలో వీరవిహారం చేయడం వెనక అప్పటి ఇంగ్లీష్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన కవ్వింపు చర్యలే కారణం అని అందరికీ తెలుసు. అంతకుముందు ఓవర్లో యువీ దగ్గరకొచ్చిన ఫ్లింటాఫ్ ఏదో అనడంతో యువీ కూడా అంతే దీటుగా బ్యాట్ చూపిస్తూ బదులిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బ్రాడ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు.
అయితే యువీని ఫ్లింటాఫ్ ఏమన్నాడు..? యువీ ఏమని బదులిచ్చాడు..? అనే విషయాలు మాత్రం ఇన్నాళ్లూ సీక్రెట్‌గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను యువీ బయటపెట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యూవీ.. ఆ నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. ‘నాకు బాగా గుర్తుంది. ఆ మ్యాచ్ 17వ ఓవర్లో ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో వరుసగా 2 ఫోర్లు కొట్టాను. దీంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్.. నాపై నోరుపారేసుకున్నాడు. 2 చెత్త షాట్లు ఆడి సంబరపడొద్దంటూ నన్ను ఎగతాళి చేశాడు. ‘నీ గొంతు కొస్తా’ అని నన్ను హెచ్చరించాడు. దానికి నేను కూడా అదే రితీలో స్పందించాను. బ్యాట్‌తో తలపై బాదుతానని వార్నింగ్ ఇచ్చాను. దాంతో మా ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి కొట్టుకునే దాకా వెళ్లింది.
కాగా.. ఫ్లింటాఫ్ నన్ను రెచ్చగొట్టడంతో ఆ తర్వాతి ఓవర్ వేసిన స్టువర్డ్ బ్రాడ్‌పై ఎదురుదాడికి దిగాను. ఆ క్రమంలోనే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాను’ అంటూ యువీ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. బ్రాడ్ వేసిన ఆ ఓవర్‌లో అంతకుముందెన్నడూ ఆడని షాట్లను ఆడానని, యార్కర్ బంతులను సైతం స్టాండ్స్‌లోకి పంపానని చెప్పుకొచ్చాడు. ఆఖరి బంతిని సిక్సర్ బాదాక ఫ్లింటాప్ వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వానని యువీ గుర్తు చేసుకున్నాడు. యువీ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.