ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్, రాహుల్ ఓపెనింగ్ చేస్తారంటూ మొదటి నుంచి చెబుతున్న కోహ్లీ సరిగ్గా మ్యాచ్‌కు అరగంట ముందు నిర్ణయం మార్చడాన్ని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. మ్యాచ్ ముందు వరకు జట్టులో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉంటాడని చెబుతూనే చివర్లో అతడిని తుది జట్టు నుంచి తొలగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలి టీ20లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి చవిచూడడానికి కోహ్లీ నిర్ణయమే కారణమని వీరూ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు రోహిత్ శర్మ జట్టులో ఉంటాడని అందరూ భావించినప్పటికీ.. కెప్టెన్ కోహ్లి అనూహ్య నిర్ణయంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అయితే టీ20 ప్రపంచకప్ కోసమే రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తున్నామని, తొలి 2 టీ20ల్లో అతడు పాల్గొనడని టాస్ సమయంలో కోహ్లి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే కోహ్లీపై వీరూ విమర్శలు గుప్పించాడు. ఆఖరి నిమిషంలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించడం సరైన నిర్ణయమో కాదో ఆలోచించుకోవాలని కోహ్లిని హితవు పలికాడు. ‘విశ్రాంతి పేరుతో జట్టులో నుంచి తప్పించే రూల్ నీకు కూడా వర్తిస్తుందా..?’ అంటూ కోహ్లిపై మండిపడ్డాడు. జట్టు కెప్టెన్‌గా ఎలాంటి విశ్రాంతి లేకుండానే కోహ్లీ ఆడుతున్నాడని, కానీ మిగతా ఆటగాళ్లకు మాత్రం విశ్రాంతి పేరుతో పక్కన కూర్చోబెడుతుండడం ఏంటని..? ప్రశ్నించాడు. ‘రోహిత్ లాంటి ఆటగాడు మ్యాచ్‌లో లేకపోతే నా టీవీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. జట్టు కూర్పు దెబ్బతింటుంది’ అంటూ విమర్శలు గుప్పించాడు. ఇక మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా తొలి టీ20లో భారత్ ఓటమికి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది చాలా చెత్త ఆలోచనని, దీనివల్లే ఓటమి చవి చూడాల్సి వచ్చిందంటూ విమర్శించాడు.
ఇదిలా ఉంటే రోహిత్ గైర్హాజరీతో బరిలోకి దిగిన భారత జట్టు తగిన మూల్యమే చెల్లించుకుంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), శిఖర్ ధావన్(4) రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. ఇక కెప్టెన్ కోహ్లీ(0) కనీసం ఖాతా కూడా తెరకుండానే పెవిలియన్ చేరాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్ 5 బంతులు ఆడిన కోహ్లీ అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి మిడ్ ఆన్‌లో ఆర్చర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులే చేయగలిగింది. అది కూడా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్(67) అర్థ సెంచరీతో రాణించడంతో ఆ స్కోర్ అయినా చేయగలిగింది. ఇక ఆ తరువాత భారత బౌలర్లు కూడా విఫలమయ్యారు. స్పెషలిస్ట్ పేసర్ లకపోవడం, పేస్ వికెట్‌పై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం టీమిండియాను తీవ్రంగా దెబ్బతీశాయి.