ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. వైస్ కెప్టెన్ అజింక్య(49), కెప్టెన్ విరాట్ కోహ్లీ(44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 146/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 71 పరుగులు చేసి మిగతా 7 వికెట్లు కోల్పోయింది. కివీస్ పేసర్లలో జేమీసన్ 5/31, వాగ్నర్ 2/40, బౌల్ట్ 2/47 ప్రదర్శనతో మెరిశారు. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కోహ్లీని అవుట్ చేసిన జేమీసన్.. భారత్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత వరుసపెట్టి వికెట్లు తీస్తూ మరింత చెలరేగిపోయాడు.
జేమీసన్ దెబ్బకు భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన జేమీసన్.. టీమిండియా ఆటను శాసించాడు. కివీస్ బౌలర్లు, ముఖ్యంగా పేసర్లను భారత్ బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా నిలువరించలేకపోయారు. క్రీజులోకి అలా వచ్చి ఇలా వెనుదిరిగారు. జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ (34), గిల్ (28), కోహ్లీ (44), రహానే (49), అశ్విన్ (22) పరవాలేదనిపించారు. జడేజా 15 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో జెమీసన్ 5 వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. సౌథీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఇక టీమిండియా ఆల్ అవుట్ కావడంతో కివీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(7), డెవాన్ కాన్వే(4) నిలకడగా ఆడుతున్నారు. ఏ మాత్రం తడబడకుండా భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే 5 ఓవర్లకు కివీస్ స్కోర్ 11/0గా నమోదైంది.