భారత క్రికెట్ చరిత్రలో టీమిండియా తొలిసారి రెండు జట్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కోహ్లీ సార్థ్యంలోని ఓ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంటే, మరో జట్టు శిఖర్ ధవన్ సారథ్యంలో శ్రీలంక పర్యటనలో ఉంది. కోహ్లీ జట్టుకు ఎప్పటిలానే మాజీ ఆటగాడు రవిశాస్త్రి కోచ్‌గా ఉండగా, ధవన్ జట్టుకు టీమిండియా మాజీ రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఈ జట్టు శ్రీలంకలో ఉంది.
ఈ క్రమంలోనే ద్రవిడ్ కోచింగ్ స్కిల్స్‌పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్, జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ సామాన్యుడు కాదని, అసాధ్యుడని బట్ ప్రశంసలు కురిపించాడు. ద్రవిడ్ ప్రతిభ అమోఘమని, యువ ఆటగాళ్లకు ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనే విషయంలో అతడిని అపార అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు.
‘భారత్.. తమ ఆటగాళ్లకు శిక్షణనిచ్చేందుకు స్పెషలిస్టులను ఎంపిక చేస్తోంది. ప్రతిభగల నిపుణులైతే వారిని పరిగణలోకి తీసుకుంటోంది. ఇక ద్రవిడ్ ఎలాంటి ప్రతిభావంతమైన శిక్షకుడో వేరే చెప్పక్కర్లేదు. దానికి తోడు ద్రవిడ్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్‌లో దిట్ట. అందుకే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అతడేంటో అనేకసార్లు నిరూపించుకున్నాడు’ అంటూ ద్రవిడ్‌పై బట్ ప్రశంసల వర్షం కురిపించాడు.
కాగా.. శిఖర్ ధవన్ కెప్టెన్సీలోని భారత జట్టు శ్రీలంక చేరుకుంది. అక్కడ ఆతిథ్య శ్రీలంక జట్టుతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.
భారత జట్టు: దేవదత్ పడిక్కల్, మనీష్ పాండే, నితీశ్ రాణా, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధవ్(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజు శాంసన్(వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్.