2011 ప్రపంచకప్‌లో అతడో స్టార్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా చరిత్ర సృష్టించాడు. కానీ క్యాన్సర్ అతడిని దెబ్బకొట్టింది. జట్టుకు దూరమై, తిరిగొచ్చినా మునుపటి ఫాం కొనసాగించలేకపోయాడు. దీంతో చివరికి రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ తాజాగా జరిగిన లెజెండ్స్ మ్యాచ్‌లో యువీ అదరగొట్టాడు. సిక్సుల మోత మోగించాడు. కేవలం 22 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి తానింకా గొప్ప బ్యాట్స్‌మన్‌నేనని మరోసారి నిరూపించాడు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన ఇండియా లెజెండ్స్-సౌత్‌ఆఫ్రికా లెజెండ్స్ మ్యాచ్‌లో యువీ ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌లా అత్యంత వేగంగా అర్థ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో ఇండియా లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ.. కేవలం 22 బంతుల్లోనే 52 పరుగులు చేసి సౌత్‌ఆఫ్రికా లెజెండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అర్థసెంచరీ చేసి అజేయంగా నిలిచిన యువీ ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు కొట్టాడు. సౌత్‌ఆఫ్రికా బౌలర్ జాండర్ డీ బ్రూన్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 4 సిక్సులు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి బాదేశాడు.
మ్యాచ్ తరువాత తన బ్యాటింగ్ గురించి యువీ మాట్లాడాడు. ‘ఇంగ్లండ్ చేతిలో తొలి టీ20లో భారత ఓటమి తర్వాత నన్ను మళ్లీ టీమిండియాలోకి తిరిగి తీసుకుంటారేమో’ అంటూ జోక్ చేశాడు.
ఇదిలా ఉంటే యువరాజ్ భారత్ తరపున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇందులో టెస్టుల్లో 33.9 సగటుతో 3 సెంచరీలు, 11 అర్థ సెంచరీలతో 1900 రన్స్ చేశాడు. వన్డేల్లో 36.5 సగటుతో 14 సెంచరీలు, 52 అర్థ సెంచరీలతో 8,701 రన్స్ చేశాడు. ఇక టీ20ల్లో 28.0 సగటుతో 8 అర్థ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 24.8 సగటుతో 13 అర్థ సెంచరీలతో 2,750 పరుగులు చేశాడు.