శ్రీలంక – బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ కీలక పాత్ర పోషించారు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ముష్ఫికర్ రహీమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ సందర్భంగా రహీమ్ మాట్లాడుతూ.. ‘ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయాం. అయితే ఆ తర్వాత నిలదొక్కుకున్నాం. తమీమ్, రియాద్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక నా విషయానికి వస్తే.. భారీ షాట్లు ఆడేందుకు నేనేమీ పొలార్డ్ లేదా రస్సెల్‌ను కాదు. నా బలం ఏంటో నాకు తెలుసు. ముఖ్యంగా వికెట్ కాపాడుకుంటూ పరుగులు రాబట్టాలని ఆలోచించాను. అదే చేశాను. నిజంగా ఇదో మంచి గేమ్. మిరాజ్, ముస్తఫిజుర్, సైఫుద్దీన్ కూడా రాణించారు’ అని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం దక్కింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్(84; 4 ఫోర్లు, 1 సిక్స్), మహ్ముదుల్లా (54;2 ఫోర్లు, 1 సిక్స్), తమీమ్ ఇక్బాల్ (52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం శ్రీలంక 48.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మిరాజ్(4/30), ముస్తఫిజుర్ (3/34) లంక బ్యాట్స్‌మన్‌ను దెబ్బతీశారు.