Thursday, November 21, 2024

‘తెలంగాణ దేవుడు’ మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, సుమన్, సునీల్, బ్రహ్మాజీ, సంగీత, మధుమిత, సత్యకృష్ణ, అజయ్, వెంకట్, కాశీ విశ్వనాధ్, వడత్యా హరీష్ తదితరులు
నిడివి: 177 నిమిషాలు
విడుదల తేది: 12-11-2021
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్‌ ఖాన్
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మహ్మద్‌ ఇంతెహాజ్‌ అహ్మద్‌
సంగీతం: నందన్ బొబ్బిలి
కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటింగ్: గౌతంరాజు
మూలకథ, నిర్మాత: మహ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్

ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఇది తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ అనేలా ప్రచారం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ జీవన విధానాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర దర్శకుడు వడత్యా హరీష్ ప్రతి ప్రెస్‌మీట్‌లో చెబుతూనే వచ్చారు. అలాగే యువ పాత్రలో నూతన హీరో అయిన జిషాన్ ఉస్మాన్‌ని, వయసుకు వచ్చిన తర్వాత శ్రీకాంత్‌ని కేసీఆర్‌గా ఈ చిత్రంలో చూపించినట్లుగా విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్ తెలియజేశాయి. ఈ సినిమా ప్రకటన తర్వాత.. ఇది కూడా ఇంతకు ముందు వచ్చిన తెలంగాణ చిత్రాల వంటిదే అని అంతా అనుకున్నా.. పోస్టర్స్, ట్రైలర్ వంటివి వచ్చాక కొత్తగా ఏదో చెబుతున్నారనే విషయం.. ఈ సినిమాపై క్రేజ్‌కి కారణమైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రను సవివరంగా ఈ చిత్రంలో తెలియజేస్తున్నారనగానే అందరిలో ఆసక్తి క్రియేట్ అయింది. అసలు కేసీఆర్‌పై సినిమా అనగానే.. సహజంగానే అంచనాలు ఉంటాయి. మరి ఆ అంచనాలను ఈ ‘తెలంగాణ దేవుడు’ చిత్రం అందుకుందో? లేదో? రివ్యూలో చూద్దాం.

కథ:
కథ చెప్పడానికి ఇది ఒక చరిత్ర. విజయ్ దేవ్ (జిషాన్ ఉస్మాన్, శ్రీకాంత్) చిన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలా నడిచింది? చదువుకునే టైమ్‌లో విజయ్ దేవ్ ఎలా ఉండేవాడు? అతను తెలంగాణ ఉద్యమం వైపు దారి తీయడానికి గల కారణాలేంటి? ఎలా విజయ్ దేవ్ ఉద్యమంలో అడుగుపెట్టి.. ఉద్యమ నాయకుడు అయ్యాడు? ఉద్యమ నాయకుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం అతను చేసిన ప్రయత్నాలేంటి? తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది? రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ దేవ్ బంగారు తెలంగాణను సాధించాడా? వంటి సమాధానాలన్నింటికి వివరణ ఇచ్చేదే ఈ చిత్ర కథ.

నటీనటుల పనితీరు:
ముందుగా యువ విజయ్ దేవ్‌గా నటించిన జిషాన్ ఉస్మాన్ గురించి చెప్పుకోవాలి. నిజంగా యువ కేసీఆర్ ఇలాగే ఉండేవాడేమో అనిపించేలా.. కొత్తవాడైనా ఎక్కడా జంక కుండా చేశాడు. ఇంకొంచం సానబడితే ఇండస్ట్రీకి మరో మంచి హీరో దొరికినట్లే అని చెప్పుకోవచ్చు. అతని పాత్రలో చాలా వైవిధ్యాలున్నాయి. స్టూడెంట్‌గా, కబడ్డీ ప్లేయర్‌గా, పెళ్లి, భూస్వాములను ఎదిరించి ఉద్యమం వైపు అడుగులు వేయడం వంటి ఘట్టాలలో జిషాన్ సమర్థవంతంగా నటించి మెప్పించాడు. కాస్త వయసు ముదిరిన తర్వాత విజయ్ దేవ్‌గా ఎంటరైన శ్రీకాంత్ అయితే విజయ్ దేవ్ పాత్రలో జీవించేశాడు. కేసీఆర్‌ని ఇమిటేట్ చేస్తూ నడక, ఆహార్యం ప్రదర్శించడమే కాకుండా తన సీనియారిటీతో ఆ పాత్ర స్థాయిని శిఖరాగ్రానికి చేర్చాడు. విజయ్ దేవ్ భార్య సుధ(సంగీత) సహజనటనతో ఆకట్టుకుంటుంది. విజయ్ దేవ్ కొడుకుగా చేసిన వెంకట్‌కు, కూతురిగా చేసిన మధుమితకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. భూస్వాములుగా తనికెళ్లభరణి, పోసానికి రెండు మూడు సీన్లు దక్కాయి. ఎప్పుడూ విజయ్ దేవ్ పక్కనే ఉంటే రమేష్ రావు పాత్రలో అజయ్, రాజారెడ్డి పాత్రలో కాశీ విశ్వనాధ్, రాజారెడ్డి కొడుకు పాత్రలో సునీల్, మెహబూబ్ ఆలీగా షాయాజీ షిండే, చిన్నతనంలో విజయ్ దేవ్‌కి విద్యాబుద్దులు నేర్పే పాత్రలలో బ్రహ్మానందం, ఆలీ వంటి వారికి మంచి పాత్రలు లభించాయి. ప్రొఫెసర్ జైశంకర్‌గా సుమన్‌ మరోసారి తన సీనియారిటీతో పాత్రకు పవరివ్వగా.. పృథ్వీ, రఘుబాబు, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, జెమిని సురేష్ వంటి వారందరూ వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ చిత్రానికి మెయిన్ హైలెట్స్ మ్యూజిక్, కెమెరా, ఆర్ట్. ముందుగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గురించి చెప్పుకుంటే విజయ్ దేవ్ పెరిగిన ఊరిలో పాఠశాల, ఆ తర్వాత ఉద్యమం సమయంలో స్టేజ్‌లు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భవనం, పార్టీ ఆఫీస్ ఇలా ప్రతీది చూస్తున్న ప్రేక్షకులు ఆయా కాలాలకు వెళ్లి వచ్చేలా చేయడంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ హరిబాబు మంచి నైపుణ్యం కనబరిచారు. కెమెరా కూడా చక్కగా మూడ్‌ని క్యారీ చేసింది. డిఓపీ విజయ్ కుమార్ తన పనితనాన్ని ప్రదర్శించారు. ఇక మెయిన్ హైలెట్ సంగీతం. పాటలు, నేపథ్య సంగీతం అన్నీ తెలంగాణ రాష్ట్రంపై ప్రేమతో చేశాడేమోగానీ.. నందన్ బొబ్బిలి ప్రాణం పెట్టేశాడు. ఎడిటర్‌కి ఇంకాస్త స్వేచ్ఛనిచ్చి ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసే అవకాశం అయితే ఉందనిపించింది. ఇక నిర్మాత జాకీర్ ఉస్మాన్ ఈ సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఆయన పెట్టిన ప్రతి పైసా.. సినిమాలో కనిపిస్తుంది. దాదాపు ఇండస్ట్రీలోని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లందరూ ఈ సినిమాలో నటించారు. వారి రెమ్యునరేషన్స్ ఏంటి? సినిమాకి కావాల్సిన ఆర్ట్ వర్క్ ఒకటేమిటి? తెలంగాణపై ఉన్న ప్రేమనంతా ఈ సినిమా ఖర్చు విషయంలో చూపించాడని చెప్పవచ్చు. దర్శకుడు వడత్యా హరీష్‌కి ఇది తొలి చిత్రం అని స్టార్టింగ్‌లో పేర్లు పడేటప్పుడు చెప్పారు. సినిమా చూశాక ఆయనకిది తొలి చిత్రం అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఒక చరిత్రని ఆయన సినిమాగా చూపించిన తీరుకి, అలాగే ఎవరినీ నొప్పించకుండా ఇటువంటి సాహసోపేతమైన ప్రయత్నానికి సర్వదా అతను అభినందనీయుడు.

విశ్లేషణ:
సినిమా స్టార్టింగే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ పార్టీ గెలిచినట్లుగా, సీఎంగా విజయ్ దేవ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా చూపించారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు విజయ్ దేవ్ అమర వీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించడం చూపించారు. ఆ తర్వాత రాజ్ భవన్‌లో విజయ్ దేవ్ ప్రమాణ స్వీకారం చేస్తుండటాన్ని.. ఇంట్లో టీవీ ముందు కూర్చున్న తాత సంతోషం పట్టలేక బంగారు తెలంగాణ వచ్చేసింది అంటూ కేకలు వేయడంతో.. ఆయన మనవళ్లు వచ్చి తెలంగాణ గురించి అడగడంతో ఫ్లాష్‌బ్యాక్‌లోకి సినిమాని తీసుకెళ్లారు. ఫ్లాష్ బ్యాక్‌లో నేలకొండపల్లిలో జరుగుతున్న బతుకమ్మ పండుగని భూస్వామి అవహేళన చేసిన తీరు.. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటివి జరిగాయా? అని చూస్తున్న ప్రేక్షకులకు చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అదొక్కటే కాదు కబడ్డీ సీన్ కూడా అలాంటిదే. కబడ్డీ సీన్‌తో యువ విజయ్ దేవ్(జిషాన్ ఉస్మాన్)ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు బాగుంది. ఆ తర్వాత ఉత్తరారోగ్రగ్రహణం పాఠ్యపుస్తకంలోని పద్యాన్ని విజయ్ దేవ్ చెప్పిన తీరుతో అతను ఏకసంతాగ్రహి అని చూపించిన తీరు, ఆ తర్వాత అతని ఉపాధ్యాయుడైన మృత్యుంజయ శర్మ(బ్రహ్మానందం) అడుగడుగునా ఇచ్చే ఆశీస్సులు.. చూస్తున్న వారికి నిజంగా ఇలా జరిగి ఉంటుందా? అని అనిపించకమానవు. అలాగే తెలుగు మహాసభల్లో తెలంగాణని అవమానించిన తీరుని చూపిన విధానం తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డని కదిలిస్తుంది. ఆ సీన్ తర్వాత అభ్యుదయవాది అయిన జైశంకర్‌ని విజయ్ దేవ్ కలుసుకోవడం, విజయ్ దేవ్ తండ్రి తెలంగాణ ఉద్యమ పార్టీని నడిపించడం వంటి వన్నీ చూస్తున్న వారికి కొత్తగా అనిపిస్తాయి. అక్కడి నుండే విజయ్ దేవ్‌ ఉద్యమ బాట వైపు అడుగులు వేసినట్లుగా చూపించారు. స్కూల్‌లో బుడ్డ బుస్వామి కాళ్లు మొక్కమనే సీన్ కూడా బాగా షూట్ చేశారు. ఆ తర్వాత విజయ్ దేవ్ పెళ్లి చూపులు, పెళ్లి అయినట్లుగా చూపించారు. అనంతరం తండ్రి నడిపే తెలంగాణ ఉద్యమ పార్టీలోకి చేరిన విజయ్ దేవ్.. నేషనల్ పార్టీలోకి వెళ్లడం, ఆ తర్వాత మనదేశం పార్టీలోకి వెళ్లడం.. ఇవేవీ తెలంగాణ ఆశయానికి సహకరించడం లేదని అన్నింటికీ రాజీనామా చేసి మళ్లీ బంగారు తెలంగాణ పార్టీ పెట్టడం వంటి వన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు. అక్కడి నుండి ఏం జరిగిందో అందరికీ కాకపోయినా.. చాలా మందికి తెలుసు. అదే సినిమాలో చూపించారు. విజయ్ దేవ్ జిల్లాల పర్యటన, తెలంగాణ ప్రజలను, విద్యార్థులను, మేధావులను ఉద్యమంలోకి తీసుకురావడం, ఆమరణ నిరాహార ధీక్ష వంటి వన్నీ తడబడకుండా దర్శకుడు చూపించిన తీరు చూస్తున్న ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలంగాణ అమరవీరుల సాంగ్, తెలంగాణ గడ్డ సాంగ్, బతకమ్మ పాట, వాడెవడు-వీడెవడు, స్వాగతం సాంగ్, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఏమి బతుకులు కొడుకా సాంగ్.. సన్నివేశాలకు అనుగుణంగా చక్కగా కుదిరాయి. పూతరేకులు సీన్, రోశయ్య పాత్రలో చేసిన దుర్గయ్య సీన్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. డైలాగ్స్ కూడా మెప్పిస్తాయి. సినిమాటిక్‌గా అలాగే కమర్షియల్‌గా ఒక చరిత్రని చెబుతున్నప్పుడు లాజిక్స్ పెద్దగా పట్టించుకోకూడదు కాబట్టి.. నిడివి విషయం ఒక్కటి పక్కన పెడితే.. ‘తెలంగాణ చరిత్ర’ ఇది అని చాటేలా ‘తెలంగాణ దేవుడు’ సినిమా ఉంది.

సినీ సర్కార్ ట్యాగ్‌లైన్: ఊహే ఉలిక్కి పడేలా చేసిన దేవుడు
సినీ సర్కార్ రేటింగ్: 3.5/5

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x