భువనేశ్వర్: ఒరిస్సాకు చెందిన ఓ రైతు అరుదైన ఆవిష్కరణ చేశాడు. తన క్రియేటివిటీకి పదును పెట్టి మరీ దీనిని తయారు చేశాడు. ఈ ఒక్క ఆవిష్కరణతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా విపరీతంగా పాపులర్ అయ్యాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఒడిశాలోని మథూర్‌భంజ్‌కు చెందిన సుశీల్ అగర్వాల్ చాలా బోర్‌గా ఫీల్ అయ్యాడు. స్వతహాగా వ్యవసాయం చేసే సుశీల్‌కు కొద్దిగా బ్యాటరీలు, వాహనాల రిపేర్ తెలుసు. దీంతో సొంతంగా ఓ ఎలక్ట్రిక్ వాహనం తయారు చేసుకోవాలని అనుకున్నాడు. ఖాళీగానే ఉండడంతో తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. దేశీయ పరికరాలతోనే ఎలక్ట్రిక్ కార్‌ను తయారు చేశాడు. పైగా ఈ వాహనం ఎలక్ట్రిక్ బ్యాటరీతోనే కాకుండా సోలార్ ఎనర్జీతో నడిచేలా ఈ డిజైన్ చేశాడు.
ఇందులో 850 వాట్ల మోటార్, 100ఎహెచ్/54 ఓల్ట్స్ బ్యాటరీని అమర్చినట్లు సుశీల్ చెప్పాడు. పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు చక్కటి ప్రత్యామ్నాయమని, అందుకే ఈ ఆలోచన చేశానని సుశీల్ చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ బ్యాటరీ సుమారు 8 గంటలలో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల దూరం వరకూ నడుస్తుందని సుశీల్ చెబుతున్నాడు. అలాగే ఈ బ్యాటరీ 10 ఏళ్ల పాటు పనిచేస్తుందని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఒక్క ఆవిష్కరణతో అతడికి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది.