గత నెల ఆకాశాన్ని తాకిన వంటనూనెల ధరలు ప్రస్తుతం భారీగా తగ్గాయి. ముఖ్యంగా నెలరోజులుగా వంట నూనెలు ధరలు తగ్గుముఖం పట్టాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ బుధవారం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని రకాల వంటనూనెల ధరలు 20 శాతం వరకు తగ్గినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా పామ్ ఆయిల్ కిలోకి 19 శాతం తగ్గి, రూ.115కు చేరిందని, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కూడా 16 శాతం తగ్గిందని, కిలో రూ.157కు చేరిందని తెలిపింది.
కాగా, వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్ లో పొందు పరచబడిన లెక్కల ప్రకారం.. గతేడాది నుంచి వేరుసెనగ నూనె, ఆవనూనె, వనస్పతి, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి 6 వంటనూనెల ధరలు దేశవ్యాప్తంగా 20 శాతం నుంచి 56 శాతం మేర పెరిగాయి. ఆవనూనె(ప్యాక్డ్) ధర గత ఏడాది మే 28 నాటికి రూ.117 ఉండగా, ఈ ఏడాది మే 28కి రూ.171కి చేరింది. అంటే 44 శాతం పెరిగింది. సోయా అయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 50 శాతం వరకూ పెరిగాయి.
2021 మే నాటికి ఈ 6 వంటనూనెల ధరల పెరుగుదల 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీయ ధరలపై పడినట్టు ఒక కారణంగా తెలుస్తోంది. వంటనూనెల పరంగా దేశ అవసరాల కోసం 56 శాతం దిగుమతులపై ఇండియా ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడినట్లు నిపుణులు భావిస్తున్నారు.