Thursday, November 21, 2024

కరోనా పోరులో డీఆర్డీవో మరో అడుగు.. మరో కొత్త కిట్‌తో..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ కరోనా ఉధృతిని అడ్డుకునేందుకు, మహమ్మారిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ జాబితాలో జాతీయ రక్షణ పరిశోధనా సంస్థ(డీఆర్డీవో) కూడా ఉంది. డీఆర్‌డీఓ ప్రయోగశాల డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్(డీఐపీఏఎస్) ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు చేస్తూ కరోనాపై పోరు కొనసాగిస్తోంది. వైరస్‌ను అంతమొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ మంచి ఫలితాలను సాధిస్తోంది. ఇప్పటికే కరోనాను అంతం చేసే 2డీసీ ఔషధాన్ని డీఆర్డీవో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ ఔషధం అతి త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా అతి తక్కువ ఖర్చుతో కచ్చితమైన కరోనా పరీక్ష నిర్వహించేందుకు యాంటీబాడీ డిటెక్షన్-బేస్డ్ కిట్ ‘డిప్‌కోవాన్(DIPCOVAN)ను రూపొందించింది.

ఢిల్లీకి చెందిన వాన్‌గార్డ్ డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు దేశీయంగా ఈ కిట్‌ను అభివృద్ధి చేశారు. కరోనా వైరస్ తీవ్రత, దాని న్యూక్లియోక్యాప్‌సైడ్ ప్రొటీన్లను ఈ డిప్‌కొవాన్ కనిపెడుతుంది. వైరస్ తీవ్రత స్థాయిని 97 నుంచి 99 శాతం వరకు ఈ కిట్ పసిగట్టగలదని డీఆర్‌డీఓ వెల్లడించింది. డిప్‌కోవాన్ ఇతర వ్యాధులతో ఎటువంటి క్రాస్ రియాక్టివిటీ లేకుండా శరీరంలో యాంటీబాడీస్ ఉన్నాయో లేదో పరీక్షించి తెలుసుకోగలదని డీఆర్డీవో చెబుతోంది.

డీప్‌కోవాన్ జూన్ మొదటి వారం నుంచి వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా మార్కెట్లోకి రానుంది. తొలిగా 100 కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ తరువాత నెలకు 500 కిట్ల చొప్పున డీఆర్డీవో అభివృద్ధి చేయనుంది. అయితే తొలుత అందుబాటులోకొచ్చే కిట్‌ల ద్వారా 10వేల మందికి కోవిడ్ పరీక్షలు చేసేందుకు వీలుంటుందని, ఒక్కో పరీక్షకు కేవలం రూ.75 మాత్రమే ఖర్చవుతుందని, కేవలం 75 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయవచ్చని డీఆర్డీవో వెల్లడించింది. ‘ఈ కిట్ 18 నెలలు పనిచేస్తుంది. ఈ కిట్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కూడా గత నెలలోనే ఆమోదించింది. 2021 మేలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్ సీఓ), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల నుంచి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌కు కూడా ఆమోదం లభించింది’ అంటూ డీఆర్డీవో వెల్లడించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x