దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పటికీ అనేక లక్షల మంది దీని బారిన పడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. అయితే కరోనా ప్రమాదం ఇంకా పోలేదని, థర్డ్ వేవ్ వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ ప్రమాదం చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతుండడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
కాగా.. థర్డ్ వేవ్ రాకముందే మరో దారుణమైన వ్యాధి ఇప్పుడు చిన్నపిల్లల్లో కనిపిస్తోంది. ఒకవేళ థర్డ్ వేవ్ ప్రభావం నిజంగా చిన్నపిల్లల్లో ఉంటే ఈ వ్యాధి మరింత ప్రబలి చిన్నారుల ప్రాణాలను సైతం బలి తీసుకుంటుందని ప్రపంచ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వ్యాధి పేరు.. మల్టీసిస్టం ఇన్ఫ్లేమటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. దీన్ని వైద్య పరిభాషల్ ఎమ్ఐఎస్-సీ అని పిలుస్తారు. కరోనా సోకిన చిన్నారుల్లో ప్రస్తుతం ఈ వ్యాధి ప్రబలుతోంది. దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను ఈ వ్యాధిపై ఒక కన్నేసి ఉంచాలని సూచనలు చేసింది. దీని చికిత్సలో నైపుణ్యం ఉన్న ఆస్పత్రులను, వైద్యసంస్థలను గుర్తించాలని సూచించింది. ఈ కొత్త వ్యాధి పేరు విన్న కోట్లాదిమంది తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎమ్ఐఎస్-సీ చికిత్స కూడా కష్టమేనని వార్తలు వినిపిస్తుండడం వారి ఆందోళనను మరింత పెంచుతోంది.
ఎమ్ఐఎస్-సీ అంటే ఏంటి?..
ప్రస్తుతానికి కరోనా సోకిన చాలా మంది చిన్నారుల్లో లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో వారిలో కొందరిలో ఈ ఎమ్ఐఎస్-సీ బయటపడుతోంది. దీని వల్ల చిన్నారుల శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, కిడ్నీలు, జీర్ణవ్యవస్థ, మెదడు, చర్మం, కళ్లు వంటి భాగాలు ఎర్రగా వాపు ఏర్పడుతుంది. మంట ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు కూడా శరీరంలోని ఏ భాగం ఈ వ్యాధి బారిన పడింది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం.. జన్యుపరంగా ఉండే కొన్ని లక్షణాల వల్ల ఈ వ్యాధి బారిన చిన్నారులు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తల భావన. ఇది సోకిన వారిలో కనిపించే లక్షణాలు కూడా వ్యాధి బారిన పడిన శరీరభాగం, తీవ్రత బట్టి మారుతుందట. ఎక్కువగా కడుపునొప్పి, వికారం, వాంతులు, ఊపిరితీసుకోవడంలో సమస్య వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఈ ఎమ్ఐఎస్-సీ ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది? అసలు ఈ వ్యాధి సోకడానికి కారణాలు ఏంటి..? అనే ప్రశ్నలకు కూడా వైద్యుల వద్ద సరైన సమాధానం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గుర్తించడం కష్టం!
కరోనా సోకిన 2 నుంచి 6 వారాల తర్వాత ఎమ్ఐఎస్-సీ బయటపడుతోంది. ఇప్పుడిదే ప్రధాన సమస్యగా మారింది. తొలిదశలోనే గుర్తిస్తే ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందించవచ్చని, అలా సాధ్యం కాకపోవడం వల్లనే ప్రమాద స్థాయి పెరుగుతోందని అంటున్నారు. వేసవిలో మలేరియా, డెంగ్యూ, వైరల్ అంటువ్యాధులు, టైఫాయిడ్, కవాసాకి డిసీజ్ వంటి చాటున ఎమ్ఐఎస్-సీ దాగి ఉంటోందని, దాన్ని గుర్తించాలంటే చాలా కష్టమని తెలుస్తోంది. దీని గుర్తించాలంటే జ్వరం వచ్చిన రెండో రోజే దీనికి సంబంధించిన ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణుల సలహా.
వైద్యుల సలహా:
ఈ వ్యాధి సోకిన చిన్నారి కరోనా నెగిటివ్గా తేలే సమయానికి వారిలో రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో ఏ ప్రాంతమైనా దెబ్బతినవచ్చని, అయితే ఇది గుండెపై ప్రభావం చూపితే మాత్రం చాలా ప్రమాదకరమని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ విభాగం హెచ్ఓడీ, డైరెక్టర్ అయిన డాక్టర్ కృషన్ చుగ్ చెబుతున్నారు. ఇది కార్డియాక్ షాక్ లేదంటే కరోనరీ ధమనులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని వెల్లడించారు.
ఒకవేళ ముందుగా గుర్తించినా.. స్టెరాయిడ్స్ వంటి ఇమ్యూనోమాడ్యులేటర్ చికిత్సలు చేసినప్పటికీ.. ఫలితం చాలా తక్కువగా కనబడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చిన్నారులున్న తల్లిదండ్రుల.. కరోనా వెళ్లిపోయిందని చేతులు దులుపుకొని కూర్చోకుండా, ఇలాంటి వ్యాధులు రాకుండా పిల్లలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.