అంగారకుడిపై గుండె కొట్టుకుంటోంది. ఒక్కసారి కాదు. క్షణక్షణం ఆ గ్రహం మొత్తం గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ శబ్దాలు పర్సీవరెన్స్ చెవికి చేరాయి. దీనికి సంబంధించిన డేటాను పర్సీవరెన్స్ నాసా హెడ్‌క్వార్టర్స్‌కు పంపింది. నిర్మానుష్యమైన అరుణ గ్రహంపై ఇలా శబ్దాలు రావడానికి శాస్త్రవేత్తలు కొన్ని కారణాలను కూడా బయటపెట్టారు. మార్స్‌పై మానవ మనుగడకు అనువైన పరిస్థితులున్నాయో లేదో.. అనే విషయాలను అన్వేషించడం కోసం ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సంస్థలన్నీ పోటీపడి మరీ పరిశోధనలు చేస్తున్నాయి. వాటన్నింటిలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ముందుంది. ఈ మధ్యనే పెర్సీవరెన్స్ అనే రోవర్‌ను నాసా అంగారకుడి పైకి పంపింది.
దాదాపు 7 నెలల ప్రయాణం తరువాత పర్సీవరెన్స్ మార్స్‌పై దిగింది. మార్చి 6 నుంచి అక్కడి పరిస్థితులను అధ్యయం చేయడం ప్రారంభించింది. ముఖ్యమైన డేటాను నాసాకు పంపుతోంది. ఆ గ్రహంపై ఉన్నమట్టి నమూనా మొదలుకొని వాతావరణానికి సంబంధించిన పలు అంశాలపై పరిశోధనలు చేస్తోంది. తాజాగా అంగారకుడిపై వినిపిస్తున్న శబ్ధాలను పర్సీవరెన్స్ రికార్డు చేసింది. ఆ శబ్దాలు స్పష్టంగా గుండె చప్పుడు చేసేటప్పుడు వచ్చే శబ్దంలా ఉండడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నాసా ఈ ఆడియోను విడుదల చేయడమే కాకుండా.. దీని వెనకున్న రహస్యాన్ని కూడా చెప్పింది. ఈ ఆడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన నాసా.. భూమిపై తుఫాను వచ్చే సమయంలో ఎంతటి ప్రచండ వేగంతో గాలులు వీస్తాయో.. అక్కడ మార్స్‌పై అనుక్షణం అలాంటి గాలులే వీస్తాయని చెప్పుకొచ్చింది. పర్సీవరెన్స్ ఈ ఆడియోను సూపర్‌మ్యాక్ మైక్రోఫోన్ సాయంతో రికార్డు చేసిందని, మరో ఆడియోనూ కూడా రోవర్ పర్సీవరెన్స్ నుంచి తమకు అందిందని నాసా తెలిపింది. ఇది లేజర్ స్ట్రయిక్స్ మాదిరిగా వినిపిస్తున్నట్లు చెప్పింది.