జేపీ మెత్సవైనియో.. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పాపులర్ ఫోటోగ్రాఫర్. 2009లో పాలపుంత గెలాక్సీని ఫోటో తీయాలని అనుకున్నాడు. అప్పటి నుంచి దానికోసం కష్టపడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు 12 ఏళ్ల పాటు కష్టపడి దశాబ్దం నాటి తన కల నెరవేర్చుకున్నాడు. ఈ ఫోటో కోసం మెత్సవైనియో ఎంతో పడ్డాడు. గెలాక్సీ మొత్తాన్ని అన్ని వైపుల నుంచి ఎన్నో ఫోటోలు తీశాడు. దాదాపు లక్ష పిక్సెల్స్ వెడల్పుతో హై రిజల్యూషన్ గిగాపిక్సెల్ క్లాస్ ఫోటోను రెడీ చేశాడు. గెలాక్సీని మొత్తం 234 మొసాయిక్ ప్యానెల్స్‌గా ఫోటో తీసి వాటిని ఒక్కటిగా జత చేశాడు. వాటి ద్వారా మొత్తం గెలాక్సీ ఫోటోను ఆవిష్కరించాడు.
మన పాలపుంత గెలాక్సీలో దాదాపు లక్ష కాంతి సంవత్సరాలకు పైగా విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు మన గెలాక్సీలో ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా ఆ నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, గ్రహశకలాలూ, దుమ్ము, ధూళి.. ఇవన్నీ మన పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్నాయి. అలాంటి నక్షత్ర మండలాన్ని ఫోటో తీయాలని అనుకోవడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన జేపీ మెత్సవైనియో గెలాక్సీని ఫోటో తీసేందుకు ఏకంగా 12 ఏళ్లు, 1,250 గంటలు కష్టపడి పాలపుంత గెలాక్సీని మొత్తంగా ఫోటో తీశాడు.