తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు మార్చి- 30 చివరి తేదీ కాగా, ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. రోజులు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి వ్యూహాల్లో వాళ్లు ఉన్నారు. అయితే అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో మాత్రం బీజేపీ స్థబ్దుగా ఉండిపోయింది. కనీసం అభ్యర్థిగా ఎవర్ని రంగంలోకి దింపాలి..? ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? అనే విషయాలను కూడా చర్చించలేదని టాక్.
వాస్తవానికి దుబ్బాక, గ్రేటర్ ఫలితాల తర్వాత బీజేపీ మంచి ఊపు మీద ఉండాల్సింది పోయి అస్తమాను నేతల విమర్శలతో ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నాయి. జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై కొందరు కమలనాథులు అడ్డగోలుగా నోరు పారేసుకోవడంతో తీవ్ర అసహనం, అవమానంగా భావించి.. బీజేపీతో కటీఫ్ అని చెప్పేసి.. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ రోజే టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించేశారు. దీంతో దాదాపు జనసేన-బీజేపీ మధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అసలు సంబంధాల్లేవ్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఈ తరుణంలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ సందేహిస్తోందని టాక్. అంతేకాదు.. అభ్యర్థి కూడా ఎవరూ ముందుకు రావట్లేదని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులను రెడీగా పెట్టుకున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఆ ప్రక్రియే ఇంకా ప్రారంభించలేదట.
ఇక తిరుపతి విషయానికొస్తే.. తన పార్టీకి చెందిన అభ్యర్థినే బరిలోకి దింపాలని విశ్వప్రయత్నాలు చేసిన పవన్.. చివరికి బీజేపీకే వదిలేశారు. బీజేపీకి సపోర్ట్ చేయాలని అభిమానులు, కార్యకర్తలు, నేతలకు పవన్ పిలుపుకూడా ఇచ్చారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఈ ఒక్క సీటు కూడా దక్కించుకోకపోతే ఎలా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారట. జనసేన వదిలేసింది కదా తాము పనులు ప్రారంభించుకోవచ్చు అనుకున్న బీజేపీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయట. తాము బరిలోకి దిగాలంటే కచ్చితంగా పవన్ వచ్చి ప్రచారం చేస్తానని చెప్పాల్సిందేనని అభ్యర్థులు చెబుతున్నారట. అంతేకాదు.. అవసరమైతే మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారట. ఇటు తెలంగాణలో పవన్‌ను కెలికనందుకు.. అక్కడ సీటు ఇవ్వనుందుకు అభ్యర్థులే దొరక్కట్లేదంటే జనసేనాని రేంజ్ ఏంటో కమలనాథులు బాగా తెలిసొచ్చిందన్న మాట. సో ఇకనైనా మర్యాదగా మెలిగి మిత్రపక్ష నేతతో ఉంటారో.. లేకుంటే ఇలానే విర్రవీగి ముందుకెళ్లి చిక్కులు తెచ్చుకుంటారో చూడాలి.