ఇంగ్లండ్ సిరీస్‌లో తన బౌలింగ్ సందర్భంగా తీసుకున్న డీఆర్‌ఎస్ తప్పుడు నిర్ణయాలపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. డీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలకు తాను బాధ్యుడిని కాదని చెప్పాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వల్లే ఆ తప్పుడు నిర్ణయాలు వచ్చాయని వివరించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముందు తన నిర్ణయాలు బాగానే ఉండేవని, కానీ ఆ సిరీస్‌లోనే తన నిర్ణయాలు ఎక్కవుగా తప్పులయ్యాయని, దీనికి వికెట్ కీపర్ పంత్ కారణమని చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో టీమిండియా తీసుకున్న డీఆర్‌ఎస్ నిర్ణయాలు అనేకం తప్పుగా నిలిచాయి. అది కూడా ఎల్‌బీడబ్ల్యూల విషయంలోనే అధికంగా జరిగింది. వాటిలో చాలావరకు అశ్విన్ బౌలింగ్‌లోనే వచ్చాయి. దీంతో నెటిజన్లు డీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలకు అశ్విన్ కారణమని అనేకమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అశ్విన్ తన బౌలింగ్‌పై క్లారిటీ ఇచ్చాడు.
‘సమీక్షల విషయంలో అంతా బౌలర్‌పై మాత్రమే ఆధారపడి ఉండదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు సమీక్షల విషయంలో చాలావరకు అనుకూలంగానే కోరేవాడిని. అయితే సమీక్ష కోరేటప్పుడు వికెట్ కీపర్ పాత్ర కూడా ఎంతో కీలకం. బంతి సరైన లైన్‌లో పడిందా? వికెట్లను తాకుతుందా? బౌలింగ్ కోణం, బౌన్స్ ఎలా ఉంది? అనే విషయాల్లో కీపర్ అతడి నిర్ణయం చాలా అవసరం. కాని రిషబ్ పంత్ అలాంటి సందర్భాల్లో చాలా సార్లు నిరాశపరిచాడు. అందుకే పంత్‌ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాను కూడా. డీఆర్‌ఎస్ విషయంలో కూర్చొని మాట్లాడుకోవాలని, నిర్ణయం తీసుకునే సమయంలో తన ఆలోచన చాలా కీలకమని వివరించానం’టూ అశ్విన్ పేర్కొన్నాడు.