టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అవుట్‌పై టీమిండియా మాజీలు మండిపడుతున్నారు. ఇదెక్కడి అవుట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవుట్ కూడా థర్డ్ అంపైర్ ఇవ్వడాన్ని వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బంతి నేలను తాకుతున్నట్లే అనిపిస్తోందిని, దానిని థర్డ్ అంపైర్ పరిశీలించి మరీ అవుట్ ఇవ్వడం సరికాదని చెప్పుకొచ్చారు. తాజాగా టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ఇది అవుట్ ఎలా అవతుంది..?’ అంటూ ప్రశ్నించాడు.
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రెండు వికెట్లను త్వరగానే కోల్పోయింది. రోహిత్ శర్మ(12), కేఎల్ రాహుల్(14) మళ్లీ నిరాశపరిచారు. కాగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావల్సిన కోహ్లీ బదులు సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకొచ్చాడు. వచ్చీరావడంతోనే తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు. అవతలి వైపు రాహుల్, కోహ్లీ(1) వెంటవెంటనే అవుటైనా.. రిషబ్ పంత్(30)తో కలిసి వికెట్ కాపాడాడు.
కానీ 13వ ఓవర్లో 57 పరుగుల వద్ద శామ్ కర్రాన్ బౌలింగ్‌లో బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న డేవిడ్ మలాన్ దానిని క్యాచ్ అందుకున్నాడు. కానీ బంతిని అందుకున్న తీరుపై థర్డ్ అంపైర్‌కు వెళ్లినా అవుట్‌గా నిర్ణయం వచ్చింది. దీనిపైనే ఇప్పుడు వివాదం రేగుతోంది. బంతిని మలాన్ అందుకున్న సమయంలో బంతి నేలకు తాకినట్లు కనిపిస్తోంది. థర్డ్ అంపైర్ ఇంత చిన్న విషయాన్ని ఎలా మిస్ అయ్యాడంటూ టీమిండియా మాజీలు విమర్శింస్తున్నారు.